పదవిలో ఉన్నా లేకపోయినా ఈ పని పూర్తి చేస్తా: తుమ్మల నాగేశ్వరరావు

  • భద్రాచలం కమ్మ సేవాసమితి ఆధ్వర్యంలో వసతిగృహం, కల్యాణమండపాలకు భూమి పూజ చేసిన తుమ్మల
  • యాదాద్రి తర్వాత భద్రాద్రి నిర్మాణానికి కేసీఆర్ కంకణం కట్టుకున్నారని వ్యాఖ్య
  • భద్రాద్రి ఆలయ నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తానన్న తుమ్మల
భద్రాచలం శ్రీ సీతారామ కమ్మవారి సేవాసమితి ఆధ్వర్యంలో వసతి గృహం, కల్యాణమండపం సముదాయం నిర్మాణానికి టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కమ్మ సేవా సమితి చేపట్టిన ఈ గొప్ప కార్యక్రమం భద్రాచలం పట్టణానికే తలమానికంగా నిలుస్తుందని అన్నారు. యాదాద్రి నిర్మాణం తర్వాత భద్రాద్రి నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కంకణం కట్టుకున్నారని చెప్పారు. అతి త్వరలోనే ఆ కార్యక్రమం కార్యరూపం దాలుస్తుందని అన్నారు.

తాను అధికారంలో ఉన్నా, లేకపోయినా, ఎక్కడ ఉన్నా భద్రాద్రి ఆలయం అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలను అందిస్తానని తుమ్మల చెప్పారు. 40 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు, రాష్ట్రానికి సేవ చేసుకునే భాగ్యం ఆ శ్రీరామచంద్రుడి దయతో కొనసాగుతోందని అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సీఎం కేసీఆర్ కేటాయించిన నిధులతో సుమారు 10 లక్షల ఎకరాల భూమి సస్యశ్యామలం అవబోతోందని చెప్పారు.


More Telugu News