తొలిసారి కలిసిన ఆ క్షణాలను గుర్తు చేసుకున్న రాహుల్ ద్రావిడ్, రోహిత్ శర్మ.. ఇదిగో వీడియో

  • తనలో లేని ప్రత్యేకతేదో రోహిత్ లో ఉందన్న ద్రావిడ్
  • వ్యక్తిగా, ఆటగాడిగా, నాయకుడిగా ఎంతో ఎదిగాడని ప్రశంస
  • తొలి సిరీస్ కు ఎంపికయ్యానని ద్రావిడే చెప్పాడన్న రోహిత్
టీ20లకు కెప్టెన్ గా రోహిత్.. టీమిండియాకు కోచ్ గా రాహుల్ ద్రావిడ్.. కాంబినేషన్ కొత్తదే. కానీ, జట్టుగా కలిసి ఆడారు వాళ్లిద్దరు. ఆ మధుర జ్ఞాపకాలను, తొలిసారి కలిసిన క్షణాలను ఒకసారి గుర్తు చేసుకున్నారు. ఇవాళ్టి నుంచి న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో వారు మీడియాతో మాట్లాడారు.

2007లో ఐర్లాండ్ వేదికగా జరిగిన సిరీస్ లో సౌతాఫ్రికాపై రోహిత్ శర్మ టీమిండియాలోకి ఎంటరయ్యాడు. అప్పుడు ద్రావిడ్.. ఇండియా కెప్టెన్ గా ఉన్నాడు. ఆ విషయాన్ని రోహిత్ శర్మ గుర్తు చేశాడు. దానికి చిరునవ్వుతో స్పందించిన ద్రావిడ్.. వాస్తవానికి అంతకుముందే రోహిత్ ను తాను కలిశానని హిట్ మ్యాన్ కు గుర్తు చేశాడు.

‘‘బస్సులో వచ్చేటప్పుడు నిన్న మేం మొదట కలుసుకున్న రోజులను గుర్తు చేసుకున్నాం. కాలం ఎంత వేగంగా ముందుకెళ్లిందో కదా అనిపించింది. అయితే, ఐర్లాండ్ సిరీస్ కన్నా ముందు మద్రాస్ లో జరిగిన చాలెంజర్ లోనే మేం తొలిసారి కలిశాం’’ అని ద్రావిడ్ చెప్పారు.

తనలో లేనిది రోహిత్ లో ఏదో కొత్త ప్రతిభ ఉందని అప్పుడే అనుకున్నానని ద్రావిడ్ చెప్పాడు. నిజాయతీగా చెప్పాలంటే ఈ 14 ఏళ్లలో ఓ వ్యక్తిగా, ఆటగాడిగా, నాయకుడిగా రోహిత్ ఎంతో ఎదిగాడని ద్రావిడ్ కొనియాడాడు. ఓ ఆటగాడిగా, ముంబై ఇండియన్స్ కు నాయకుడిగా ఎన్నో ఘనతలు అతడు సాధించాడన్నాడు.

తాను క్రికెట్ లోకి ఎంటరైనప్పుడు ద్రావిడ్ వంటి గొప్ప ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూం పంచుకుంటానని అస్సలు ఊహించలేదని రోహిత్ చెప్పుకొచ్చాడు. 2007లో తనకు టీమిండియా నుంచి పిలుపొచ్చిందని, కానీ, అంతకుముందే బెంగళూరు క్యాంప్ లో ద్రావిడ్ తో ఇంటరాక్ట్ అయ్యానని గుర్తు చేశాడు. మాట్లాడింది కొద్దిసేపే అయినా చాలా నర్వస్ గా అనిపించిందన్నాడు. ఐర్లాండ్ సిరీస్ కి తాను ఎంపికైన విషయాన్ని స్వయంగా ద్రావిడే చెప్పాడని, అప్పుడు చంద్రమండలానికి వెళ్లినంత ఆనందంగా అనిపించిందని రోహిత్ తెలిపాడు.


More Telugu News