నాసా ఆర్బిటర్ ను ఢీకొట్టే పెను ప్రమాదం నుంచి చంద్రయాన్-2ను రక్షించిన ఇస్రో!

  • చంద్రుడి ఉత్తర ధ్రువంపై తిరుగుతున్న చంద్రయాన్-2, నాసా ఎల్ఆర్‌వో
  • రెండింటి మధ్య దూరం తగ్గిపోయి ఢీకొట్టే ప్రమాదం
  • ముందే గుర్తించి అప్రమత్తమైన ఇరు ఏజెన్సీలు
  • సీఏఎంను అమలు చేసి చంద్రయాన్-2ను దూరంగా తరలించేసిన ఇస్రో
  • ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల వెల్లువ
అంతరిక్షంలో జరగబోయే పెను ప్రమాదం నుంచి చంద్రయాన్-2ను రక్షించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. చంద్రుడి ఉత్తర ధ్రువంలో చంద్రయాన్-2 ఆర్బిటర్.. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన లూనార్ రీకనైసెన్స్ ఆర్బిటర్ (ఎల్‌ఆర్‌వో)ను ఢీకొట్టకుండా రక్షించింది. ఒకవేళ ఈ ప్రమాదం కనుక జరిగి ఉంటే చంద్రుడి కక్ష్య ‘స్పేస్ జంక్’తో నిండిపోయి ఉండేది. అంతేకాదు, ఇరు అంతరిక్ష సంస్థలకు పెను నష్టం సంభవించి ఉండేదని ఇస్రో తెలిపింది.

చంద్రుడి కక్ష్యలో సంచరిస్తున్న ఈ రెండు వ్యోమ నౌకల మధ్య విభజన దూరం వంద మీటర్ల కంటే తక్కువగా ఉండడం, రెండింటి మధ్య కనీస దూరం మూడు కిలోమీటర్లు మాత్రమే ఉన్నట్టు ఇస్రో శాస్త్రవేత్తలు గుర్తించారు. అక్టోబరు 20న ఉదయం 11:15 గంటల సమయంలో ఈ రెండు ఒకదాన్నొకటి ఢీకొనే అవకాశం ఉందని గుర్తించిన ఇరు ఏజెన్సీల శాస్త్రవేత్తలు అప్రమత్తమయ్యారు.

క్లోజింగ్ అప్రోచ్ ముప్పును తగ్గించేందుకు కొల్లిషన్ అవాయిడెన్స్ మనూవా (సీఏఎం) అవసరమని రెండు ఏజెన్సీలు భావించాయి. అంతేకాదు, సీఏఎంకు చంద్రయాన్-2 ఆర్బిటర్ లొంగుతుందని గుర్తించారు. దీంతో అక్టోబరు 18న సీఏఎంను షెడ్యూల్ చేసి రెండు నౌకల మధ్య తగినంతగా రేడియల్ విభజన ఉండేలా చూసుకున్నారు. అదే రోజు రాత్రి 8.22 గంటలకు సీఏఎంను అమలు చేసి చంద్రయాన్-2 ఆర్బిటర్‌ను మరో కక్ష్యలోకి తరలించారు. దీంతో రెండు నౌకలు ఢీకొనే ముప్పు తప్పింది. చంద్రయాన్-2 కొత్త కక్ష్యలోకి వెళ్లిపోవడంతో సమీప భవిష్యత్తులో నాసా ఎల్ఆర్ఓతో ఎలాంటి సన్నిహిత సంబంధాలు ఉండవని, ముప్పు తొలగినట్టేనని ఇస్రో శాస్త్రవేత్తలు వివరించారు.

నిజానికి చంద్రయాన్-2, నాసా ఎల్ఆర్‌వో రెండూ చంద్రుని ధ్రువ కక్ష్యలో పరిభ్రమిస్తూ ఉంటాయి. ఈ క్రమంలో చంద్రుడి ధ్రువాల మీదుగా ఇవి రెండు పరస్పరం దగ్గరగా వస్తుంటాయి. తాజా ఘటనకు ఇదే కారణం. ఇది సర్వ సాధారణమైన విషయమేనని, అలాంటప్పుడే సీఏఎంను అమలు చేస్తామని ఇస్రో పేర్కొంది. అయితే, ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారని పేర్కొంది. కాగా, అంతరిక్షంలో రెండు వ్యోమ నౌకలు ఢీకొనకుండా ఇస్రో చేసిన సాహసంపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఇస్రో తాజాగా వెల్లడించడం గమనార్హం.


More Telugu News