మందులు వాడకుండానే మాయమైన హెచ్ఐవీ!

  • రెండో వ్యక్తిని గుర్తించిన పరిశోధకులు
  • ‘ఎలైట్ కంట్రోలర్స్’లో ‘స్టెరిలైజింగ్ క్యూర్’
  • రహస్యాన్ని ఛేదిస్తే విప్లవాత్మక మార్పులు వస్తాయంటున్న శాస్త్రవేత్తలు
ఒకసారి హెచ్ఐవీ బారినపడితే ఇక జీవితాంతం దానిని మోయాల్సిందే. వ్యాధిని పూర్తిగా నయం చేయడానికి మందులు లేవు. అయితే, వ్యాధి ముదరకుండా ఉండేందుకు మాత్రం యాంటీ రిట్రోవైరల్ డ్రగ్స్ ఉన్నాయి. అందుకే, నివారణ ఒక్కటే దీనికి మార్గం.

అలాంటి ఈ వ్యాధి నుంచి గతంలో ఒకరు బయటపడగా.. తాజాగా మరో వ్యక్తి ఎలాంటి మందులు వాడకుండానే పూర్తిగా కోలుకున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో వీరిద్దరిపై దృష్టిసారించిన పరిశోధకులు వారిలో రోగ నిరోధక వ్యవస్థలు ఎలా పనిచేశాయన్న దానిపై పరిశోధనలు ప్రారంభించారు. ఆ రహస్యాన్ని ఛేదిస్తే విప్లవాత్మక మార్పులు తీసుకురావొచ్చని భావిస్తున్నారు.

శరీరంలోకి హెచ్ఐవీ వైరస్ ప్రవేశించిన తర్వాత అది తన జన్యురాశిని ఇతర కణాల డీఎన్ఏలోకి చొప్పించి వాటిని వైరల్ రిజర్వాయర్లుగా మార్చుతుంది. ఆ తర్వాత వీటి నుంచి వైరస్ పుట్టుకొస్తుంది. హెచ్ఐవీ కోసం అందుబాటులోకి వచ్చిన రిట్రో వైరల్ డ్రగ్స్ ఈ రిజర్వాయర్లపై పనిచేసినప్పటికీ వాటిని పూర్తిగా నాశనం చేసే సామర్థ్యం వాటికి లేదు. అయితే, కొత్తగా వైరస్ పుట్టకుండా మాత్రం అడ్డుకుంటుంది. దీంతో వ్యాధి ముదరకుండా ఉంటుంది.

అయితే, కొంతమంది వ్యక్తుల్లోని రోగ నిరోధక వ్యవస్థలు ఎలాంటి ఔషధాలు లేకుండానే వైరస్‌ను అణచివేసే శక్తిని కలిగి ఉంటాయి. ఇలాంటి వ్యక్తులను ‘ఎలైట్ కంట్రోలర్స్’గా పిలుస్తుంటారు. ఔషధాల అవసరం లేకుండానే హెచ్ఐవీ నుంచి బయటపడడాన్ని ‘స్టెరిలైజింగ్ క్యూర్’గా పిలుస్తారు. తాజాగా మరో వ్యక్తి కూడా ఇలానే బయటపడినట్టు శాస్త్రవేత్తలు ప్రకటించారు.

ఆ వ్యక్తి నుంచి సేకరించిన 119 కోట్ల రక్త కణాలను, 50 కోట్ల కణజాల కణాలను పట్టిపట్టి పరీక్షించినా ఎక్కడా హెచ్ఐవీ జినోమ్ జాడ కనిపించలేదని పరిశోధకులు తెలిపారు. ఎలైట్ కంట్రోలర్స్‌లో స్టెరిలైజింగ్ క్యూర్ ఎలా జరుగుతుందో కనుక తెలుసుకోగలిగితే హెచ్ఐవీకి పరిష్కారం లభించినట్టేనని మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ వైద్య నిపుణురాలు జూ యూ తెలిపారు. బాధితుల రోగ నిరోధక వ్యవస్థలు తమంత తాముగా స్టెరిలైజింగ్ క్యూర్‌ను చేపట్టేలా ప్రయోగాలు జరుపుతున్నట్టు వివరించారు.


More Telugu News