క్రీడా నేపథ్యంపై దృష్టి పెడుతున్న హీరోలు!

  • బాక్సింగ్ నేపథ్యంలో 'లైగర్'
  • అదే నేపథ్యంలో వరుణ్ తేజ్ 'గని' 
  • విలువిద్య చుట్టూ తిరిగే 'లక్ష్య'
  • ఈ తరహా కథలపై చరణ్ ఆసక్తి  
ఈ మధ్య కాలంలో తెలుగు హీరోలు క్రీడలకు సంబంధించిన కథలపై దృష్టి పెడుతున్నారు.  నాని హీరోగా చేసిన 'జెర్సీ' సినిమా హిట్ అయిన దగ్గర నుంచి, మిగతా హీరోలు కూడా ఈ తరహా పాత్రలు చేయడానికి ఆసక్తిని చూపుతున్నారు. హాకీ నేపథ్యంలో  సందీప్ కిషన్ 'A1 ఎక్స్ ప్రెస్' సినిమా చేయగా, మహిళా కబడ్డీ నేపథ్యంలో గోపీచంద్ 'సీటీమార్' సినిమాను చేశాడు. అయితే ఈ రెండు సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు.

ఇక ఇప్పుడు బాక్సింగ్ నేపథ్యంలో విజయ్ దేవరకొండ 'లైగర్' సినిమాను చేస్తున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణను జరుపుకుంది. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక వరుణ్ తేజ్ చేస్తున్న 'గని' కూడా బాక్సింగ్ నేపథ్యంలోనే నడుస్తుంది. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమా, డిసెంబర్ 24వ తేదీన విడుదల కానుంది.

లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్న నాగశౌర్య కూడా ఈ సారి ఇలాంటి కథనే ఎంచుకున్నాడు. విలువిద్యకి సంబంధించిన కథతో ఆయన 'లక్ష్య' సినిమాను చేశాడు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో 'జెర్సీ' డైరెక్టర్ తో చరణ్ చేయనున్న సినిమా కూడా క్రీడా నేపథ్యంలోనిదేనని చెబుతున్నారు. మరి వీటిలో ఏది ఎన్ని మార్కులు కొట్టేస్తుందో చూడాలి.


More Telugu News