మాపై జరిగిన దాడుల వెనుక కేసీఆర్ హస్తం ఉంది: బండి సంజయ్

  • టీఆర్ఎస్ దాడుల్లో 8 వాహనాలు ధ్వంసమయ్యాయి
  • మా షెడ్యూల్ ని పోలీసులకు ఇచ్చినా వారు పట్టించుకోలేదు
  • శాంతిభద్రతల సమస్యను కేసీఆరే సృష్టిస్తున్నారు
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ జిల్లాల పర్యటన చేస్తున్న సంగతి తెలిసిందే. నిన్న ఆయన నల్గొండ జిల్లాలో పర్యటించారు. ఆయన పర్యటన ఆద్యంతం ఉద్రిక్తతల మధ్యనే కొనసాగింది. నిన్న చీకటి పడిన తర్వాత ఆయన కాన్వాయ్ పై దాడి కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు సూర్యాపేటలో మీడియాతో సంజయ్ మాట్లాడుతూ... తమపై దాడుల వెనుక ముఖ్యమంత్రి కేసీఆర్ హస్తం ఉందని ఆరోపించారు. ఈ దాడులకు సూత్రధారి కేసీఆరే అని చెప్పారు.

తెలంగాణలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని బండి సంజయ్ విమర్శించారు. తన పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ని ముందుగానే పోలీసులకు ఇచ్చామని... అయినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదని మండపడ్డారు. తమ పర్యటనను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తుందని తెలిసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. స్వయంగా ముఖ్యమంత్రే శాంతిభద్రతల సమస్యను సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు.

వానాకాలం పంటను రాష్ట్ర ప్రభుత్వం కొనేంత వరకు విడిచిపెట్టే ప్రసక్తే లేదని బండి సంజయ్ హెచ్చరించారు. ముఖ్యమంత్రి ఫాం హౌస్ నుంచి బయటకు రావడం లేదని విమర్శించారు. సమస్యలను పరిష్కరించాలని వారే ధర్నాలకు దిగడం, దాడులకు పాల్పడటం దారుణమని అన్నారు. నిన్న టీఆర్ఎస్ చేసిన దాడిలో 8 వాహనాలు ధ్వంసమయ్యాయని చెప్పారు.


More Telugu News