రూ. 5 కోట్ల విలువైన వాచ్ ల వ్యవహారం.. హార్దిక్ పాండ్యా వివరణ!

  • హార్దిక్ వద్ద రెండు విలువైన వాచ్ లను కస్టమ్స్ అధికారులు గుర్తించారంటూ వార్తలు
  • రూ. 1.5 కోట్ల ఒక వాచ్ ను దుబాయ్ లో లీగల్ గా కొన్నానన్న పాండ్యా
  • చట్టాలకు వ్యతిరేకంగా తాను వ్యవహరించలేదని వ్యాఖ్య 
టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా వద్ద ఉన్న రూ. 5 కోట్ల విలువ చేసే రెండు వాచ్ లను ముంబై ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. కస్టమ్స్ డ్యూటీ కట్టకుండా ఇల్లీగల్ గా పాండ్యా వాటిని తీసుకొచ్చాడంటూ కథనాలు వస్తున్నాయి. ఈ వార్తలపై పాండ్యా స్పందించాడు.  

రూ. 5 కోట్ల విలువైన రెండు వాచ్ లను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారనే వార్తల్లో నిజం లేదని పాండ్యా చెప్పాడు. దుబాయ్ నుంచి తాను రూ. 1.5 కోట్ల విలువైన ఒక వాచ్ మాత్రమే తెచ్చానని... మీడియాలో వార్తలు వస్తున్నట్టుగా రూ. 5 కోట్ల విలువైన రెండు వాచ్ లు తీసుకురాలేదని తెలిపాడు. ముంబై ఎయిర్ పోర్టులో దిగిన వెంటనే తన వద్ద ఉన్న బిల్లులు చూపించి, కస్టమ్స్ డ్యూటీ కట్టేందుకు తానంతట తానే కస్టమ్స్ కౌంటర్ దగ్గరకు వెళ్లానని చెప్పాడు.

పర్చేజ్ డాక్యుమెంట్లన్నింటినీ సమర్పించాలని తనను కస్టమ్స్ అధికారులు కోరారని పాండ్యా తెలిపాడు. అధికారులు అడిగిన అన్నింటినీ తాను వారికి ఇచ్చానని చెప్పాడు. వాచ్ కు సంబంధించి అధికారులు ప్రస్తుతం వాల్యుయేషన్ చేస్తున్నారని... వారు ఎంత సుంకం చెల్లించమంటే అంత చెల్లిస్తానని తెలిపాడు.

తాను చట్టాలను గౌరవించే వ్యక్తినని పాండ్యా అన్నాడు. అన్ని ప్రభుత్వ వ్యవస్థలను తాను గౌరవిస్తానని చెప్పాడు. ముంబై కస్టమ్స్ అధికారుల నుంచి తనకు మంచి సహకారం అందిందని తెలిపాడు. తాను కూడా అన్ని విధాలా సహకరిస్తానని వారికి చెప్పానని అన్నాడు. తాను చట్ట వ్యతిరేకంగా వ్యవహరించానని వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పాడు.


More Telugu News