రెండు రోజులుగా హైదరాబాద్‌ను చుట్టేస్తున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం

  • ఆది, సోమవారాల్లో కనిపించిన స్పేస్ స్టేషన్
  • నేటి సాయంత్రం 6.59 గంటలకు నాలుగు నిమిషాలపాటు కనిపించే అవకాశం
  • నిర్ధారించిన నాసా వెబ్‌సైట్
భూమి చుట్టూ తిరుగుతూ పరిశోధనలు చేసే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం గత రెండు రోజులుగా హైదరాబాద్ పైనుంచి చక్కర్లు కొడుతున్నట్టు ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. భూమికి 350 కిలోమీటర్ల ఎత్తున, గంటకు 27,724 కిలోమీటర్ల వేగంతో భూమి చుట్టూ తిరుగుతున్న అంతరిక్ష కేంద్రం ఆదివారం సాయంత్రం 6.55 గంటలకు 5 నిమిషాలు, నిన్న ఉదయం 6.08 గంటలకు 6 నిమిషాలపాటు పెద్ద నక్షత్రంలా హైదరాబాద్‌కు నైరుతి దిక్కున కనిపించింది.

దీనిని అంతరిక్ష కేంద్రంగా ఖగోళ శాస్త్రవేత్తలు ఇప్పటికే గుర్తించగా, అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన ‘స్పాట్ ది స్టేషన్’ వెబ్‌సైట్ కూడా ఈ విషయాన్ని నిర్ధారించింది. నేటి సాయంత్రం 6.59 గంటలకు దాదాపు 4 నిమిషాలపాటు స్పేస్ స్టేషన్ మరోమారు కనిపించే అవకాశం ఉందని ప్లానెటరీ సొసైటీ డైరెక్టర్ రఘునందన్ తెలిపారు.


More Telugu News