తీన్మార్ మల్లన్నఫై ‘హత్యాయత్నం’ వార్తల పట్ల స్పందించిన జైలు అధికారులు

  • జైలులో తనను చంపేందుకు కుట్ర జరిగిందన్న మల్లన్న
  • లేని చీకటి గదుల్లో ఎలా బంధిస్తారన్న జైలు అధికారులు
  • మల్లన్న ఆరోపణలు ముమ్మాటికీ తప్పన్న జైలు పర్యవేక్షణాధికారి
చంచల్‌గూడ జైలులో తనను చంపేందుకు, అది కుదరకపోవడంతో పిచ్చివాడిని చేసేందుకు కుట్ర జరిగిందంటూ క్యూ న్యూస్ యూట్యూబ్ చానల్ అధినేత తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ చేసిన ఆరోపణలపై చంచల్‌గూడ జైలు అధికారులు స్పందించారు. మల్లన్న చేసిన ఆరోపణల్లో ఏ ఒక్కటీ నిజం కాదన్నారు.

జైలులో ప్రతి ఖైదీకి సౌకర్యాలు ఉంటాయని, వారి బాగోగులు చూసేందుకు భద్రతా సిబ్బంది కూడా ఉంటారని జైలు పర్యవేక్షణాధికారి డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. మల్లన్న ఆరోపించినట్టు జైలులో చీకటి గదులే లేవని స్పష్టం చేశారు. లేని గదుల్లో తనను బంధించారని మల్లన్న చెప్పడం సరికాదని అన్నారు.

‘తీన్మార్ మల్లన్న టీం భవిష్యత్ కార్యాచరణ’ పేరుతో మొన్న ఘట్‌కేసర్‌ మండలం కొర్రెములలో సదస్సు నిర్వహించారు. ఇందులో పాల్గొన్న మల్లన్న మాట్లాడుతూ.. అక్టోబరు 2న గాంధీ జయంతి రోజున పాత నేరస్థుల సహకారంతో తనను చంపాలని ప్రయత్నించారని ఆయన ఆరోపించారు.

అయితే, వారి ప్రయత్నం విఫలం కావడంతో తర్వాతి రోజు జైలులో తనను ఓ చీకటి గదిలో బంధించారని అన్నారు. మానసిక దివ్యాంగులకు ఇచ్చే ఔషధాలను బలవంతంగా తనకు ఎక్కించి పిచ్చివాడిని చేయాలనుకున్నారని మల్లన్న ఆరోపించారు. ఈ ఆరోపణలపై తాజాగా స్పందించిన జైలు అధికారులు ఈ ఆరోపణలను కొట్టిపడేశారు.


More Telugu News