కొత్త ఉద్యోగంలో రవిశాస్త్రి!

  • ఇటీవల టీమిండియా కోచ్ గా శాస్త్రి పదవీవిరమణ
  • 2022 జనవరిలో యూఏఈలో ఎల్ఎల్ సీ
  • లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీలో కమిషనర్ గా శాస్త్రి
  • తన కొత్త నియామకం పట్ల శాస్త్రి హర్షం
టీమిండియా ప్రధాన కోచ్ గా ఇటీవలే పదవీవిరమణ చేసిన క్రికెట్ దిగ్గజం రవిశాస్త్రి కొత్త ఉద్యోగం చూసుకున్నారు. త్వరలో జరగనున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్ (ఎల్ఎల్ సీ)లో రవిశాస్త్రి కమిషనర్ గా నియమితులయ్యారు. తన కొత్త నియామకంపై రవిశాస్త్రి స్పందించారు. క్రికెట్ తో తన సంబంధం ఇంకా కొనసాగుతుండడం పట్ల ఎంతో సంతోషిస్తున్నానని తెలిపారు. తమ విభాగాల్లో చాంపియన్ల వంటి ఆటగాళ్లు ఈ లీగ్ లో పాల్గొంటున్నారని, అలాంటి దిగ్గజాలతో నిర్వహించే టోర్నీలో భాగం కావడం హర్షణీయమని పేర్కొన్నారు.

ఈ టోర్నీలో పాలుపంచుకునే క్రికెట్ యోధులు తమను తాము కొత్తగా నిరూపించుకోవాల్సిందేమీ లేదని, కానీ మైదానంలో మరోసారి వారు పోరాడే తీరు అందరినీ అలరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. లెజెండ్స్ తో నిర్వహించే ఈ టోర్నీ విభిన్నమైనదని, దీనికి మంచి భవిష్యత్తు ఉంటుందని భావిస్తున్నట్టు పేర్కొన్నారు.

ఎల్ఎల్ సీ తొలి సీజన్ వచ్చే ఏడాది జనవరిలో యూఏఈ వేదికగా జరగనుంది. రవిశాస్త్రి నియామకంపై ఎల్ఎల్ సీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో రామన్ రహేజా స్పందిస్తూ, రవిశాస్త్రి భారత్ కే కాకుండా, ప్రపంచ క్రికెట్ కి కూడా దిగ్గజం వంటివాడని కితాబునిచ్చారు. భారత్ కు అనేక సంవత్సరాలుగా విశిష్ట సేవలు అందిస్తున్నాడని కొనియాడారు.


More Telugu News