వార్నర్‌పై మూకుమ్మడి దాడి చేశారుగా.. ఇప్పుడేమంటారు?: విరుచుకుపడిన ఫించ్

  • వార్నర్ పని అయిపోయిందని కాలాలకు కాలాలు రాశారుగా
  • క్లిష్ట సమయంలో వార్నర్ ఇంతే, చెలరేగిపోతాడు
  • ఆస్ట్రేలియాకు తొలి టీ20 ప్రపంచకప్ అందించినందుకు గర్వంగా ఉంది
ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడిన ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌పై ఇటీవల వచ్చినన్ని విమర్శలు గతంలో ఎప్పుడూ రాలేదు. విమర్శకులైతే పనిగట్టుకుని మరీ వార్నర్‌పై విరుచుకుపడ్డారు. అతడి పని అయిపోయిందని తేల్చేశారు. టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో భాగంగా గత రాత్రి న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించిన తర్వాత ఆసీస్ కెప్టెన్ అరోన్ ఫించ్ ఈ విమర్శలపై ఓ రేంజ్‌లో స్పందించాడు.

కీలక మ్యాచ్‌లో 38 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 53 పరుగులు చేసి  జట్టు విజయానికి పునాది వేసిన విధ్వంసకర ఆటగాడు వార్నర్‌పై ఫించ్ ప్రశంసల వర్షం కురిపించాడు. వార్నర్ పని అయిపోయిందన్న విమర్శకులు ఇప్పుడేమంటారని ప్రశ్నించాడు. క్లిష్టసమయాల్లో వార్నర్‌ను ఆపడం ఎవరి తరమూ కాదని అన్నాడు. వార్నర్ పని అయిపోయిందని చాలామంది చాలా రకాలుగా రాశారని, అలా రాసిన వారు ఇప్పుడేమంటారని నిలదీశాడు. క్లిష్ట సమయాల్లో అద్భుతంగా ఆడడం వార్నర్‌కు అలవాటైన పనేనని కొనియాడాడు.

అలాగే, ఆడం జంపా, మార్కస్ స్టోయినిస్, మాథ్యూవేడ్‌లపైనా కంగారూ కెప్టెన్ ప్రశంసలు కురిపించాడు. టీ20 ప్రపంచకప్ విజయం అందరిదీ అని పేర్కొన్న ఫించ్.. తన దృష్టిలో మాత్రం జంపానే ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అన్నాడు. మార్ష్ అద్భుతంగా ఆడాడని అన్నాడు. ఆస్ట్రేలియాకు తొలి టీ20 ప్రపంచకప్ అందించినందుకు గర్వంగా ఉందన్నాడు.


More Telugu News