కుప్పం మున్సిపల్ ఎన్నికలను స్వయంగా పర్యవేక్షించేందుకు వెళ్తున్న చంద్రబాబు

  • నెల్లూరు కార్పొరేషన్ తో పాటు 12 మున్సిపాలిటీలకు కొనసాగుతున్న పోలింగ్
  • కుప్పంలో టీడీపీ నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • వైసీపీ అక్రమాలను అడ్డుకోవాలని టీడీపీ శ్రేణులను ఆదేశించిన చంద్రబాబు
కుప్పం మున్సిపాలిటీకి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఉదయం నుంచి కొనసాగుతోంది. నెల్లూరు కార్పొరేషన్ తో పాటు వివిధ జిల్లాల్లోని 12 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మరోవైపు చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పలువురు టీడీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో కుప్పం నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.

దొంగ ఓట్లు వేయకుండా టీడీపీ శ్రేణులు అడ్డుకోవాలని ఈ సందర్భంగా చంద్రబాబు ఆదేశించారు. వైసీపీ అక్రమాలను అడ్డుకోవాలని చెప్పారు. ఎక్కడ అక్రమాలు జరుగుతున్నా వీడియోలు తీసి వెంటనే పంపించాలని తెలిపారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని అన్నారు. తాను కూడా కుప్పంకు వస్తున్నానని చెప్పారు. కాసేపట్లో ఆయన కుప్పంకు బయల్దేరుతున్నారు. పోలింగ్ ప్రక్రియను దగ్గరుండి స్వయంగా పర్యవేక్షించనున్నారు.


More Telugu News