గేదె పాలివ్వడం లేదంటూ పోలీసులను ఆశ్రయించిన రైతు

  • మధ్యప్రదేశ్ లో ఘటన
  • కొన్ని రోజులుగా గేదె పాలివ్వకపోవడంతో రైతులో ఆందోళన
  • చేతబడి జరిగిందన్న గ్రామస్తులు
  • పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన రైతు
మధ్యప్రదేశ్ లోని భింద్ జిల్లాలో ఆశ్చర్యకర ఘటన జరిగింది. తన గేదె పాలివ్వడంలేదంటూ ఓ రైతు పోలీసులను ఆశ్రయించాడు. నవగాం గ్రామానికి చెందిన బాబూలాల్ జటావ్ (45 ) వ్యవసాయదారుడు. ఆయనకు కొన్ని పాడిగేదెలు కూడా ఉన్నాయి. అయితే వాటిలో ఒకటి కొన్ని రోజులుగా పాలివ్వడంలేదంటూ బాబూలాల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. గేదెను కూడా పోలీస్ స్టేషన్ కు తోలుకు వెళ్లాడు. తన గేదెకు ఎవరో చేతబడి చేసి ఉంటారని, అందుకే పాలివ్వడంలేదని తెలిపాడు. చేతబడి జరిగిన విషయాన్ని గ్రామస్తులు కూడా బలపరుస్తున్నారని వివరించాడు. ఈ విషయంలో పోలీసులే తనకు సాయపడాలని అర్థించాడు.

గేదె పాలివ్వడంలేదంటూ తమకు ఫిర్యాదు అందిన విషయం డీఎస్పీ వరకు వెళ్లింది. దీనిపై డీఎస్పీ అర్వింద్ షా స్పందిస్తూ, అతని సమస్య పరిష్కారమైందని వెల్లడించారు. అతడికి పశు వైద్యుడి ద్వారా సలహాలు అందించే ఏర్పాట్లు చేయాలని పోలీసు సిబ్బందికి సూచించామని తెలిపారు. ఈ నేపథ్యంలో, తన గేదె పాలు ఇస్తోందంటూ ఆ రైతు ఈ ఉదయం పోలీస్ స్టేషన్ కు వచ్చి చెప్పాడని డీఎస్పీ వివరించారు.


More Telugu News