హనుమ విహారిని అందుకే తీసుకోలేదు.. ఎంపిక చేయకపోవడానికి కారణం చెప్పిన సునీల్ గవాస్కర్

  • ఐపీఎల్ లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదన్న సన్నీ
  • అందులో ప్రదర్శనే ప్రాతిపదికగా ఎంపిక
  • చాన్నాళ్లుగా అతడు క్రికెట్ ఆడలేదని కామెంట్
న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో తెలుగు కుర్రాడు హనుమ విహారికి బీసీసీఐ (బోర్డ్ ఫర్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా) మొండి చెయ్యే చూపించింది. అతడి ప్లేస్ లో కె.ఎస్. భరత్ కు చోటిచ్చింది. మంచి ఫామ్ లో ఉన్న విహారిని పక్కనపెట్టడం పట్ల బీసీసీఐపై విమర్శలు కూడా వచ్చాయి.

అయితే, దీనిపై సునీల్ గవాస్కర్ స్పందించారు. చాన్నాళ్లుగా అతడు క్రికెట్ ఆడకపోవడం వల్లే సెలెక్టర్లు పక్కనపెట్టారని చెప్పారు. ఐపీఎల్ 2021లో ఆడకపోవడం వల్ల కూడా అతడు సెలెక్టర్ల దృష్టిలో పడలేదని తెలిపారు. ఐపీఎల్ లో చేసిన ప్రదర్శన ఆధారంగానే ఎక్కువగా జాతీయ జట్టులోకి ఆటగాళ్ల ఎంపికలు జరుగుతుంటాయని ఆయన పేర్కొన్నారు.

నిజంగా చెప్పాలంటే విహారిని ఎంపిక చేయకపోవడం తననేమీ ఆశ్చర్యానికి గురిచేయలేదన్నారు. ఈ మధ్య కాలంలో అతడు ఎక్కువ క్రికెట్ ఆడలేదన్నారు. న్యూజిలాండ్ తో సిరీస్ కోసం సెలెక్టర్లు ఐపీఎల్ పెర్ఫార్మెన్స్ ను ప్రాతిపదికగా తీసుకుని ఉంటారని పేర్కొన్నారు. ఒక్క ఐపీఎల్ మ్యచ్ కూడా ఆడని విహారిని సెలెక్టర్లు పట్టించుకోలేదని చెప్పారు.  

అయితే, విహారిని ఇండియా 'ఏ' జట్టులోకి తీసుకున్నారు. ఓవల్ లో ప్రియాంక్ పాంచల్ నేతృత్వంలో అతడు సౌతాఫ్రికాతో మూడు మ్యాచ్ లు ఆడనున్నాడు. రాబోయే దక్షిణాఫ్రికా టూర్ కోసం అతడిని సిద్ధం చేస్తున్నారని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. డిసెంబర్ 17 నుంచి దక్షిణాఫ్రికాలో ఇండియా మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. జొహెన్నస్ బర్గ్, సెంచూరియన్, కేప్ టౌన్ లలో ఆ మ్యాచ్ లు జరగనున్నాయి.


More Telugu News