దేశంలో 17 నెలల కనిష్ఠానికి పడిపోయిన కరోనా యాక్టివ్ కేసులు

  • దేశంలో అదుపులోకి వస్తున్న కరోనా
  • నిన్న 285 మంది కరోనాతో మృతి
  • 0.39 శాతానికి పడిపోయిన యాక్టివ్ కేసులు
దేశంలో కరోనా అదుపులోకి వస్తోంది. ప్రతిరోజు నమోదవుతున్న కొత్త కేసుల్లో భారీ తగ్గుదల కనిపిస్తోంది. గత 24 గంటల్లో 11,271 కేసులు నమోదుకాగా, 285 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. అలాగే, క్రియాశీల కేసుల సంఖ్య కూడా భారీగా దిగివచ్చింది. కేంద్ర ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో వెలుగుచూసిన 11 వేలకుపైగా కేసుల్లో దాదాపు సగం అంటే 6 వేలకుపైగా ఒక్క కేరళలోనే నమోదయ్యాయి.

నిన్న ఒక్క రోజులోనే 12,55,904 మందికి పరీక్షలు నిర్వహించారు. తాజా మరణాలతో కలుపుకుని దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 4,63,530కి పెరిగింది. కరోనా మహమ్మారి నుంచి గత 24 గంటల్లో 11,376 మంది కోలుకున్నారు. వీరితో కలుపుకుని ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3.38 కోట్లు దాటింది.

రికవరీ రేటు అత్యధికంగా 98.26 శాతానికి పెరిగింది. గతేడాది మార్చి తర్వాత రికవరీ రేటు ఈ స్థాయికి చేరుకోవడం ఇదే తొలిసారి. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 17 నెలల కనిష్ఠానికి తగ్గింది. ప్రస్తుతం 0.39 శాతం మంది అంటే 1,35,918 మంది కరోనాకు చికిత్స తీసుకుంటున్నారు. దేశంలో ఇప్పటి వరకు 112 కోట్ల కరోనా డోసులను పంపిణీ చేశారు.


More Telugu News