సెమీస్‌లో పాక్ ఓటమి తర్వాత.. ‘భారత్ మాతా కీ జై’ అని నినాదాలు చేస్తున్న ఆసీస్ అభిమాని వీడియో వైరల్.. ఇందులో నిజమెంత?

  • టీ20 ప్రపంచకప్ సెమీస్‌లో ఆసీస్ చేతిలో ఓడిన పాక్
  • ఆ వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో
  • ‘ఇండియా టుడే’ ఫ్యాక్ట్ చెక్‌లో తేలిన అసలు నిజం
  • అభిమాని నినాదాలు కరెక్టే
  • పది నెలల క్రితం నాటి వీడియోగా తేలిన వైనం
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత జట్టు ఓటమి పాలవడాన్ని సగటు భారత అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. మరోవైపు, అప్రతిహత విజయాలతో సెమీస్‌లోకి దూసుకెళ్లిన పాకిస్థాన్.. ఆస్ట్రేలియాపై  ఓటమి పాలయ్యాక  సోషల్ మీడియాకెక్కిన ఓ వీడియో విపరీతంగా వైరల్ అయింది.

ఆస్ట్రేలియా జెర్సీ ధరించిన అభిమాని ‘భారత్ మాతా కీ జై’, ‘వందేమాతరమ్’ అని నినదించడమే ఇందుకు కారణం. అలా నినదిస్తున్న అతడికి ఇండియన్ ఫ్యాన్స్ కూడా తోడయ్యారు. సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్న ఈ వీడియో పై ‘ఇండియా టుడే’ యాంటీ ఫేక్ న్యూస్ వార్ రూమ్ (ఏఎఫ్‌డబ్ల్యూఏ) చేసిన నిజ నిర్ధారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ వీడియో ఫేక్ అని తేల్చింది. అది ఈ ఏడాది జనవరిలో బ్రిస్బేన్‌లో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్టు మ్యాచ్‌కు సంబంధించినదని తేల్చింది. అందుకు సంబంధించిన మరో వీడియోను పోస్టు చేసింది.

ఇదే వీడియోను జనవరి 18న డాక్టర్ అశుతోష్ మిశ్రా అనే వ్యక్తి పోస్టు చేశారు. ‘‘గబ్బాలో వర్షం కురుస్తున్నప్పటికీ ‘భారత్ మాతా కీ జై’ అని నినదిస్తున్న ఈ ఆస్ట్రేలియా అభిమానిని మాత్రం మీరు మిస్సవాలని అనుకోరు’’ అని దానికి క్యాప్షన్ రాసి ఉంది. ఆ వీడియోను తానే రికార్డు చేసినట్టుగా కూడా మిశ్రా రాసుకొచ్చారు. ఆస్ట్రేలియాలో ఉన్న మిశ్రాను ‘ఇండియా టుడే’ సంప్రదించినప్పుడు ఈ ఏడాది మొదట్లో గబ్బా టెస్టు సందర్భంగా ఈ వీడియోను తానే రికార్డు చేసినట్టు ఆయన నిర్ధారించారు.

ఆ  టెస్టు నాలుగో రోజున  టీమిండియా అద్భుతంగా ఆడిందని, ఈ సందర్భంగా ఆసీస్ అభిమాని ఒకరు భారత్ అనుకూల నినాదాలు చేశారని గుర్తు చేశారు. ఈ సందర్భంగానే తాను ఆ వీడియోను రికార్డు చేశానని పేర్కొన్నారు. ‘భారత్ మాతా కీ జై’ అని అతడు నినదించిన విధానం బాగుండడంతో తాను ముగ్ధుడినయ్యానని చెప్పారు.

ఇనిస్టిట్యూట్ ఫర్ ఆస్ట్రేలియా ఇండియా ఎంగేజ్‌మెంట్, నేషనల్ స్పోర్ట్స్ చైర్ ఆఫ్ ఆస్ట్రేలియా ఇండియా బిజినెస్ కౌన్సిల్ సీఈవో అయిన మిశ్రా అదే మ్యాచ్‌లో చిత్రీకరించిన మరికొన్ని వీడియోలను కూడా పంచుకున్నారు. అదే అభిమాని ‘వందేమాతరం’ అని నినదించినట్టు మరో వీడియోలో ఉంది.  ఈ వీడియోను ‘ఇండియన్ క్రికెట్ స్టేడియమ్స్’ తన ఫేస్‌బుక్ పేజీలో ఈ ఏడాది జనవరిలో పోస్టు చేసింది.

వీటన్నింటినీ నిర్ధారించుకున్న తర్వాత తాజాగా వైరల్ అవుతున్న వీడియో 10  నెలల క్రితం నాటిదని తేలింది. టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా-పాకిస్థాన్ సెమీస్ మ్యాచ్‌కు, ఈ వీడియోకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టమైంది. అయితే, ఆసీస్ అభిమాని ‘భారత్ మాతా కీ జై’, ‘వందేమాతరమ్’ అని నినదించడం మాత్రం నిజమేనని నిర్ధారణ అయింది.


More Telugu News