ఎయిడెడ్ విద్యాసంస్థలపై ఆప్షన్ల పేరుతో మభ్యపెట్టవద్దు: పవన్ కల్యాణ్ హితవు

  • ఎయిడెడ్ విద్యాసంస్థల విలీనంపై రగడ
  • ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
  • తాజాగా నాలుగో ఆప్షన్ ఇచ్చిన ప్రభుత్వం
  • జీవోలు రద్దు చేయాలంటూ పవన్ డిమాండ్
ఎయిడెడ్ సంస్థల విలీనం, ఉద్యోగుల అప్పగింతపై ఏపీ ప్రభుత్వం తాజాగా నాలుగో ఆప్షన్ ఇచ్చిన నేపథ్యంలో విమర్శలు వస్తున్నాయి. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈ అంశంపై తీవ్రస్థాయిలో స్పందించారు. ఎయిడెడ్ విద్యాసంస్థలపై ఇచ్చిన జీవోలను వెంటనే రద్దు చేయాలని, గ్రాంట్ ఇన్ ఎయిడ్ కొనసాగించాలని డిమాండ్ చేశారు.

ఆప్షన్ల పేరుతో మభ్యపెట్టే ప్రయత్నం చేయవద్దని హితవు పలికారు. మెమో ద్వారా ఎయిడెడ్ విద్యాసంస్థలకు ఆప్షన్లు ఇచ్చామని ప్రకటించినా, వాటిలో మతలబులే కనిపిస్తున్నాయని విమర్శించారు. ఆప్షన్ల పేరుతో విద్యార్థులను, తల్లిదండ్రులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. నాలుగు ఆప్షన్లు ఇచ్చాం... విద్యాసంస్థల నిర్వాహకులు ఏదో ఒకటి ఎంచుకుంటారు అంటూ విద్యాశాఖ తన బాధ్యత నుంచి తప్పించుకోరాదని పవన్ పేర్కొన్నారు.

ఎయిడెడ్ సంస్థలకు ఇచ్చిన నాలుగు ఆప్షన్లలో మొదటి రెండు ఆప్షన్లను ప్రభుత్వం బలంగా చెబుతోంది అంటే నాలుగు జీవోల ద్వారా తీసుకున్న నిర్ణయాలకు కచ్చితంగా కట్టుబడి ఉన్నట్టే భావించాల్సి వస్తోందని తెలిపారు. ఎప్పటిలాగే ఎయిడెడ్ విద్యాసంస్థలు కొనసాగాలి అంటే... జీవో 42, జీవో 50, జీవో 51, జీవో 19 లను రద్దు చేయాలని స్పష్టం చేశారు.


More Telugu News