తెలంగాణలో వేడెక్కుతున్న రాజకీయం.. డీకే అరుణ ఫామ్‌హౌస్‌లో బీజేపీ నేతల రహస్య సమావేశం

  • హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత వేడెక్కిన రాజకీయం
  • రాత్రి 8 గంటలకు ఫామ్ హౌస్‌లో సమావేశం
  • హాజరుకానున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
  • రహస్య సమావేశం కాదంటున్న మరికొందరు
తెలంగాణలో రాజకీయం రోజురోజుకు రంజుగా మారుతోంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత వేడెక్కిన రాజకీయాలు దూషణభూషణలతో కొత్త పుంతలు తొక్కుతున్నాయి. మరీ ముఖ్యంగా ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రం తీరుపై విరుచుకుపడిన తర్వాత టీఆర్ఎస్, బీజేపీ మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు సర్వసాధారణమయ్యాయి. టీఆర్ఎస్, బీజేపీ నేతల పోటాపోటీ ధర్నాలతో రాజకీయం మరింత హీటెక్కింది.

ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నేతలు మరికాసేపట్లో (రాత్రి 8 గంటలకు) రహస్య సమావేశం కానున్నారన్న వార్త హాట్ టాపిక్ అయింది. నగర శివారులోని పార్టీ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఫామ్‌హౌస్‌లో ఈ సమావేశం జరగనుండగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్, హుజూరాబాద్ నుంచి ఇటీవల విజయం సాధించిన ఈటల రాజేందర్, డీకే అరుణ, రఘునందన్‌రావు, రాజాసింగ్, జితేందర్‌రెడ్డి, వివేక్ తదితరులు ఈ సమావేశానికి హాజరవుతున్నట్టు సమాచారం.

అందరూ కలిసి టీఆర్ఎస్‌ను ఎదుర్కోవడం ఎలా అన్న అంశంతోపాటు నేతల మధ్య నెలకొన్న విభేదాలను రూపుమాపి, అందరినీ ఒక్క తాటిపైకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టు చెబుతున్నారు. అలాగే, ఆపరేషన్ ఆకర్ష్, ఇతర పార్టీ నేతల చేరికలపైనా చర్చించనున్నట్టు సమాచారం. అయితే, కొందరు మాత్రం ఇది రహస్య సమావేశం కాదని, అరుణ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు అయిన సందర్భంగా నేతలకు విందు ఏర్పాటు చేశారని చెబుతున్నారు.


More Telugu News