పరిస్థితి మారకపోతే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోవడం ఖాయం: పొన్నం ప్రభాకర్

  • నాయకుల మధ్య సమన్వయ లోపమే హుజూరాబాద్ ఓటమికి కారణం
  • కొందరు నేతలు టీఆర్ఎస్ కు అనుకూలంగా పని చేస్తున్నారు
  • సాగర్, దుబ్బాక, హుజూర్ నగర్ ఓటమిలపై కూడా సమీక్ష నిర్వహించాలి
హుజూరాబాద్ ఉపఎన్నిక వేడి తెలంగాణ కాంగ్రెస్ లో ఇంకా చల్లారలేదు. ఈరోజు కాంగ్రెస్ అధిష్ఠానం హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓటమిపై సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆరోపణలు చేశారు.

నాయకుల మధ్య సమన్వయ లోపమే పార్టీ ఓటమికి కారణమని చెప్పారు. గతంలో పీసీసీ అధ్యక్షులుగా పనిచేసిన కె. కేశవరావు, డి. శ్రీనివాస్ లు రాజ్యసభ పదవుల కోసం కాంగ్రెస్ కు మోసం చేశారని అన్నారు. ఇప్పుడు మరో మాజీ పీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తన కజిన్ బ్రదర్ కౌశిక్ రెడ్డికి టీఆర్ఎస్ లో ఎమ్మెల్సీ ఇప్పించుకున్నారని మండిపడ్డారు.

పద్ధతి మార్చుకోకపోతే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోతుందని పొన్నం ప్రభాకర్ అన్నారు. కొందరు కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ కు సహకరిస్తున్నారని విమర్శించారు. కేవలం హుజూరాబాద్ ఓటమిపైనే కాకుండా నాగార్జునసాగర్, దుబ్బాక, హుజూర్ నగర్ ఓటమిలపై కూడా సమీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు.


More Telugu News