రోహిత్ పై ఓడిన లంక.. ఆ సంచలన ఇన్నింగ్స్ కు ఏడేళ్లు.. ఈడెన్ గార్డెన్స్ లో ఊచకోతే.. ఇదిగో వీడియో

  • కెరీర్ లోనే అత్యుత్తమ గణాంకాలు
  • ఎవరూ చెరిపేయలేని రికార్డు
  • అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన హిట్ మ్యాన్
  • వీడియోను పోస్ట్ చేసిన బీసీసీఐ
ముందు నెమ్మదిగా మొదలు పెడతాడు.. ఆ తర్వాత గేర్లు మారుస్తాడు.. టాప్ గేర్ కు వెళ్లాక చెలరేగిపోతాడు.. ఇదీ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ విధ్వంసం. ఒక్కసారి వాటిని రివైండ్ చేసుకుంటే అలాంటి బోలెడు ఇన్నింగ్స్ లు కళ్ల ముందు గిర్రున తిరిగేస్తాయి. ఎవరికీ సాధ్యం కాని రీతిలో మూడు డబుల్ సెంచరీలు బాది.. ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు.

వన్డేల్లో ఎవరూ చేరుకోలేని అత్యధిక వ్యక్తిగత పరుగుల మైలురాయిని సృష్టించి పెట్టాడు. దాన్ని ఇప్పటిదాకా ఎవరూ కదపలేకపోయారు. రోహిత్ శర్మ కెరీర్ లోనే బెస్ట్ అని చెప్పుకునే ఆ ఇన్నింగ్స్ ను ఎవరు మాత్రం మరచిపోతారు? బౌలర్ ఎవరన్నది చూడని రోహిత్ ఊచకోత అలాంటిది మరి. ఈడెన్ గార్డెన్స్ మొత్తాన్ని ఉర్రూతలూగించిన ఆ ఇన్నింగ్స్ శక్తి అంతటిది మరి.

ఆరోజు 173 బంతుల్లో 264 పరుగులు చేసి రోహిత్ ‘హిట్ మ్యాన్’ అనిపించుకున్నాడు. 33 ఫోర్లు, 9 సిక్స్ లు బాది.. సహచరుల నుంచి ఎనలేని ప్రశంసలు పొందాడు. విరాట్ కోహ్లీ కూడా రోహిత్ కు ఆనాడు ‘బో డౌన్’ చేశాడంటే ఆ ఇన్నింగ్స్ ఎంత అమోఘమైనదో. ఆ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్.. రోహిత్ విధ్వంసానికి ఐదు వికెట్లు కోల్పోయి 404 పరుగులు చేసింది. ఛేదనలో శ్రీలంక 251 పరుగులకే కూలింది. కనీసం రోహిత్ వ్యక్తిగత స్కోరునూ చేరలేదు.  

ఆ మ్యాచ్ లో భారత్ పై శ్రీలంక ఓడిందనేకంటే.. రోహిత్ పై లంక ఓడిందంటే అతిశయోక్తి కాదేమో. 2014 నవంబర్ 13న జరిగిన రోహిత్ పరుగుల వేట, ఈడెన్ విధ్వంసానికి ఇవాళ్టికి ఏడేళ్లు. ఈ సందర్భంగా బీసీసీఐ ఆ ఇన్నింగ్స్ ను మరోసారి గుర్తు చేసింది. వీడియోను పోస్ట్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు ఆ వీడియోను ఓ సారి లుక్కేసేయండి.



More Telugu News