అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిని కాపాడిన మహిళా ఎస్సైకి సీఎం స్టాలిన్ ప్రశంసాపత్రం

  • చెన్నైలో భారీ వర్షాలకు విరిగిపడిన చెట్లు
  • చావుబతుకుల్లో వ్యక్తి
  • భుజాలపై మోసిన ఎస్సై రాజేశ్వరి
  • వీడియో వైరల్
  • అభినందించిన సీఎం స్టాలిన్
చెన్నై నగరంలో నిన్న ఓ వ్యక్తి అపస్మారక స్థితిలో పడివుండగా, రాజేశ్వరి అనే మహిళా సబ్ ఇన్ స్పెక్టర్ స్వయంగా అతడిని తన భుజాలపై మోసి ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. చావుబతుకుల్లో ఉన్న వ్యక్తిని కాపాడేందుకు ఎంతో శ్రమించారు. రోడ్డుపై పడిన చెట్ల కొమ్మలు తొలగించి, ఆపై ఆ అభాగ్యుడ్ని ఆటో వరకు మోసుకొచ్చారు.

ఎస్సై రాజేశ్వరి మానవతా దృక్పథం సీఎం స్టాలిన్ ను కూడా ఆకట్టుకుంది. ఆయన ఎస్సై రాజేశ్వరిని తన కార్యాలయానికి పిలిపించి మనస్ఫూర్తిగా అభినందించారు. ఆమెకు ప్రశంసా పత్రం అందజేశారు. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారంటూ ఎస్సై రాజేశ్వరిని కొనియాడారు.

అంతకుముందు చెన్నై నగర పోలీస్ కమిషనర్ శంకర్ జివాల్ కూడా ఎస్సై రాజేశ్వరి సేవల పట్ల కితాబునిచ్చారు. ఆమె ఒక అద్భుతమైన అధికారిణి అని అన్నారు. ఆమె ఆసుపత్రికి తరలించిన వ్యక్తి ప్రాణాపాయ స్థితి నుంచి కోలుకున్నాడని వెల్లడించారు.


More Telugu News