ఏ విషయంలో అయినా రాజకీయాలు చేయండి కానీ, రైతుల విషయంలో మాత్రం వద్దు: మంత్రి శ్రీనివాస్ గౌడ్

  • రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ రైతు మహా ధర్నాలు
  • కేంద్రం దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్న శ్రీనివాస్ గౌడ్
  • రైతుల నుంచి ధాన్యం కొనాలంటూ డిమాండ్
  • ఎంతవరకైనా పోరాడతామని హెచ్చరిక
యాసంగి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలంటూ తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నాలు జరుగుతున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన మహా ధర్నా కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ నుంచి వరిధాన్యం కొనేది లేదంటూ కేంద్రం దుర్మార్గమైన నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. ఇక్కడి భూములకు తగిన పంటలనే తాము పండిస్తామని, ఆపిల్ పంటలేమీ పండించలేం కదా అని వ్యాఖ్యానించారు.

ఏ విషయంలో అయినా రాజకీయాలు చేసినా సహిస్తాం కానీ, రైతుల విషయంలో రాజకీయాలను ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. రాష్ట్ర రైతాంగానికి తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు.

కేంద్రం ఎట్టి పరిస్థితుల్లోనూ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. లేకపోతే ఎంతవరకైనా కొట్లాడతామని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలోనూ పోరాడతామని పేర్కొన్నారు.


More Telugu News