'భీమ్లా నాయక్' కొత్త రిలీజ్ డేట్ ఖరారైనట్టే!

  • పవన్ తాజా చిత్రంగా 'భీమ్లా నాయక్'
  • మరో ప్రధానమైన పాత్రలో రానా 
  • ముందుగా అనుకున్న రిలీజ్ జనవరి 12
  • ఫిబ్రవరి 24కి వాయిదా అంటూ టాక్  
పవన్ కల్యాణ్ - రానా ప్రధానమైన పాత్రలుగా 'భీమ్లా నాయక్' రూపొందుతోంది. మలయాళ మూవీ 'అయ్యప్పనుమ్ కోషియుమ్'కి ఇది రీమేక్. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా, చిత్రీకరణ పరంగా చివరిదశకి చేరుకుంది. పవన్ కల్యాణ్ భార్య పాత్రలో నిత్యామీనన్ నటించగా, రానా జోడీగా సంయుక్త మీనన్ కనిపించనుంది.

ఈ సినిమా నుంచి ఇంతవరకూ వదిలిన టీజర్ కీ .. ట్రైలర్ కి .. లిరికల్ సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తమన్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనుంది. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ముందుగా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీన విడుదల చేయాలనుకున్నారు.

ఆ తరువాత 'ఆర్ ఆర్ ఆర్' జనవరి 7వ తేదీన వస్తున్నట్టుగా ప్రకటన వెలువడటంతో, 'భీమ్లా నాయక్' విడుదల తేదీ వాయిదా పడినట్టుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమాను ఫిబ్రవరి 24వ తేదీన విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు. దాదాపు ఇదే తేదీ ఖరారు కావొచ్చునని అంటున్నారు. ఫిబ్రవరి 4న 'ఆచార్య' .. ఫిబ్రవరి 11న 'ఖిలాడి' ఉన్న సంగతి తెలిసిందే.


More Telugu News