వైసీపీ నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ కు అరుదైన గౌరవం

  • లండన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ సంస్థ 'సర్టిఫికెట్ ఆఫ్ కమిట్ మెంట్' కు ఎంపిక 
  • కరోనా కాలంలో చేసిన కృషికి గుర్తింపు
  • జగన్ సూచనల మేరకు ప్రజలకు సేవలందించానన్న ఆర్థర్
కర్నూలు జిల్లా నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్ కు అరుదైన గౌరవం దక్కింది. లండన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ సంస్థ ఆయనను 'సర్టిఫికెట్ ఆఫ్ కమిట్ మెంట్' కు ఎంపిక చేసింది. కరోనా పంజా విసురుతున్న సమయంలో తన నియోజకవర్గంలో చేసిన సేవలకు  గాను ఆయనకు సర్టిఫికెట్ ఆఫ్ కమిట్ మెంట్ ఇస్తోంది.

కరోనా బాధితులను పరామర్శించడం, వారికి అండగా నిలవడం, ప్రజలకు అందుబాటులో ఉండటం, సొంత డబ్బుతో కూలీలు, కార్మికులకు శానిటైజర్లు, మాస్కులతో పాటు నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం వంటి పనులను ఆర్థర్ చేశారు. ఈ సేవలకు గుర్తింపుగా ఆయనకు అరుదైన గౌరవం లభించింది. నందికొట్కూరులో త్వరలో జరిగే కార్యక్రమంలో ఎమ్మెల్యేను సన్మానించి ఈ సర్టిఫికెట్ ను అందించనున్నారు.

ఈ సందర్భంగా ఆర్థర్ మాట్లాడుతూ... కరోనాను కట్టడి చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ ఎంతో శ్రమించారని కొనియాడారు. ఆయన సూచనల మేరకు తాను కరోనా కష్టకాలంలో నిరంతరం ప్రజల మధ్య ఉంటూ సేవలందించానని చెప్పారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ కరోనా కట్టడికి కృషి చేశానని తెలిపారు.


More Telugu News