ఆస్ట్రేలియాతో సెమీస్ కు ముందు రెండ్రోజులు ఐసీయూలో ఉన్న పాక్ ఆటగాడు

  • టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన పాక్ ప్రస్థానం
  • సెమీస్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి
  • మ్యాచ్ కు ముందు రిజ్వాన్ కు తీవ్ర అస్వస్థత
  • ఆసుపత్రిలో చికిత్స పొంది మ్యాచ్ ఆడిన వైనం
టీ20 వరల్డ్ కప్ లో టైటిల్ ఫేవరెట్ గా పేర్కొన్న పాకిస్థాన్ జట్టు ఆస్ట్రేలియాతో సెమీస్ సమరంలో అనూహ్యరీతిలో ఓటమిపాలైంది. కాగా, ఈ మ్యాచ్ కు ముందు అనేక వార్తలు వచ్చాయి. పాక్ కీలక ఆటగాళ్లు సెమీస్ లో ఆడబోవడంలేదన్నదే వాటి సారాంశం. కెప్టెన్ బాబర్ అజామ్ వాటిపై మ్యాచ్ కు ముందే స్పష్టత నిచ్చాడు.

కాగా, ఆసీస్ తో మ్యాచ్ ముగిసిన తర్వాత పాక్ క్రికెట్ దిగ్గజం షోయబ్ అక్తర్ పంచుకున్న ఫొటో తీవ్ర కలకలం రేపింది. పాక్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ ఓ ఆసుపత్రిలోని ఐసీయూలో ఉండడం ఆ ఫొటోలో చూడొచ్చు. మ్యాచ్ కు ముందు రెండ్రోజులు రిజ్వాన్ ఐసీయూలో చికిత్స పొందాడని అక్తర్ వెల్లడించారు.

ఛాతీలో తీవ్రమైన ఇన్ఫెక్షన్ రావడంతో అతడిని ఆసుపత్రికి తరలించారని తాజాగా వెల్లడైంది. ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో రిజ్వాన్ అద్భుతంగా రాణించి 67 పరుగులు నమోదు చేశాడు. అనారోగ్యం ఛాయలేవీ కనిపించకుండా అద్భుతంగా ఆడాడు. ఆపై వికెట్ కీపింగ్ కూడా ఎంతో మెరుగ్గా చేశాడు.


More Telugu News