తీరాన్ని దాటిన వాయుగుండం... తమిళనాడు, ఏపీలో విస్తారంగా వర్షాలు

  • చెన్నై సమీపంలో భూభాగంపైకి వచ్చిన వాయుగుండం
  • క్రమంగా బలహీనపడే అవకాశం
  • ఏపీకి 24 గంటల వర్ష సూచన
  • తమిళనాడులో ఇప్పటివరకు 14 మంది మృతి
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పశ్చిమ వాయవ్య దిశగా కదిలి కారైక్కల్, శ్రీహరికోట మధ్య చెన్నైకి సమీపంలో తీరం దాటింది. దీని ప్రభావంతో ఉత్తర తమిళనాడు, ఏపీ దక్షిణ కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాగల 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

ప్రస్తుతం చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ దళాలను ఈ రెండు జిల్లాలకు తరలించారు. తిరుపతి పట్టణం జలమయం అయింది. తిరుమల కొండపైనా ఈ మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురుస్తోంది. జిల్లాలో నదులు ఉప్పొంగుతున్నాయి.

ఈ సాయంత్రం తీరం దాటిన వాయుగుండం క్రమంగా బలహీనపడుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. చెన్నైలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయంటూ జారీ చేసిన హెచ్చరికను ఐఎండీ  సవరించింది. భారీ నుంచి అతి భారీ వర్షాల హెచ్చరికగా మార్పు చేసింది. తమిళనాడులోని ఇతర జిల్లాల్లోనూ రేపటి నుంచి వర్షాలు తగ్గుముఖం పడతాయని వెల్లడించింది.

ఇప్పటివరకు కురిసిన భారీ వర్షాల కారణంగా తమిళనాడులో 14 మంది మరణించారు. చెన్నై నగరంలో ఇప్పటికీ నీరు తొలగిపోలేదు. ఎక్కడ చూసినా రోడ్లపై నీరు నిలిచి ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. 12 సబ్ వేలను మూసివేశారు. అటు చెన్నై ఎయిర్ పోర్టులో మధ్యాహ్నం నుంచి సాయంత్రం 6 గంటల వరకు కార్యకలాపాలు నిలిపివేశారు.


More Telugu News