రీతూ వర్మ ఆశలన్నీ ఆ సినిమాపైనే!

  • 'పెళ్లిచూపులు'తో మంచి క్రేజ్
  • నిరాశపరిచిన 'టక్ జగదీశ్'
  • అదే బాటలో 'వరుడు కావలెను'
  • సెట్స్ పై 'ఒకే ఒక జీవితం'
రీతూ వర్మ పేరు చెప్పగానే ఎవరికైనా సరే ముందుగా 'పెళ్లి చూపులు' సినిమా గుర్తుకు వస్తుంది. ఆ సినిమాతో ఆమె అంతగా ప్రభావం చూపింది. ఆ తరువాత 'కేశవ' సినిమా చేసినా అది పెద్దగా ఆడలేదు. ఆ తరువాత ఆమె తమిళ సినిమాలపైనే ఎక్కువ దృష్టి పెట్టింది. అక్కడ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళుతోంది.

ఈ నేపథ్యంలోనే తెలుగు నుంచి మళ్లీ ఆమెకు అవకాశాలు వెళ్లాయి. నాని కథానాయకుడిగా శివ నిర్వాణ తెరకెక్కించిన 'టక్ జగదీష్' సినిమాలో ఆమె నాయికగా నటించింది. ఊరు బాగుకోసమే కాదు .. కథానాయకుడికి తోడుగా నిలబడిన పాత్ర ఇది. సింపుల్ గా .. చాలా సహజంగా ఆ పాత్రలో ఆమె ఆకట్టుకుంది. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేకపోయింది.

దాంతో రీతూ వర్మ పాత్రకి రావలసినంత గుర్తింపు రాకుండా పోయింది. ఆ తరువాత సినిమాగా ఆమె 'వరుడు కావలెను' చేసింది. నాగశౌర్య జోడీగా ఆమె చేసిన ఈ పాత్ర 'పెళ్లి చూపులు' సినిమాలోని పాత్రకి దగ్గరగా అనిపిస్తుంది. ఈ సినిమాలోని పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. విడుదలకి ముందే ఫొటోగ్రఫీకి మంచి మార్కులు పడ్డాయి. దాంతో ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందనే అనుకున్నారు. కానీ వసూళ్లు రాబట్టలేకపోయింది. రీతూకి వెంటవెంటనే రెండు ఫ్లాపులు పడటం దురదృష్టమే .. ఇక ఆమె ఆశలన్నీ 'ఒకే ఒక జీవితం'పైనే ఉన్నాయి.


More Telugu News