ప్రియురాలికి గిఫ్టులు కొనిస్తూ.. షికార్ల‌కు తిప్ప‌డానికి కిడ్నాప్ డ్రామా ఆడిన కుర్రాడు

  • త‌ల్లిదండ్రుల‌నే బెదిరించి డబ్బులాగాల‌నుకున్న వైనం
  • కిడ్నాప‌ర్ లా ఫోన్ చేసి రూ.2.5 ల‌క్ష‌ల డిమాండ్
  • ప్లాన్ బెడిసి కొట్టి అరెస్టు
  • మధ్యప్రదేశ్‌లోని భీండ్‌ జిల్లా గోహద్ లో ఘ‌ట‌న‌
ప్రియురాలి మోజులో ప‌డ్డాడు.. సంపాద‌నేమో లేదు.. ప్రేమిస్తోన్న అమ్మాయికి గిఫ్టులు కొనిస్తూ, ఆమెను షికార్ల‌కు తీసుకెళ్లాలి.. డ‌బ్బులు ఎలా? అని ఆలోచించాడు. చివ‌ర‌కు త‌ల్లిదండ్రుల‌నే బెదిరించి డబ్బులాగాల‌నుకున్నాడు. ప్లాన్ బెడిసి కొట్టింది. అత‌డిని పోలీసులు అరెస్టు చేశారు.

పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే... మధ్యప్రదేశ్‌లోని భీండ్‌ జిల్లా గోహద్‌ ప్రాంతానికి చెందిన సందీప్ అనే కుర్రాడు ప్రియురాలి కోసం కిడ్నాప్ నాట‌కం ఆడాడు. త‌ల్లిదండ్రుల‌కు ఫోన్ చేసి కిడ్నాపర్‌లా గొంతుమార్చి మాట్లాడాడు. మీ కుమారుడిని మీకు అప్ప‌జెప్పాలంటే రూ.2.5 లక్షలు ఇవ్వాలి అంటూ బెదిరించాడు. లేదంటే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కొంటార‌ని హెచ్చ‌రించాడు. భ‌య‌ప‌డిపోయిన త‌ల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

పోలీసులు దర్యాప్తు చేపట్టి నిజాన్ని తేల్చారు. సందీపే త‌ల్లిదండ్రుల‌కు ఫోన్ చేసి కిడ్నాపర్ లా డ‌బ్బు డిమాండ్ చేశాడ‌ని గుర్తించారు. సందీప్ మొబైల్‌ నెట్‌వర్క్‌ లొకేషన్‌ ఆధారంగా పోలీసులు గ్వాలియర్‌లో అత‌డి ఆచూకీని గుర్తించారు. అత‌డిని అరెస్టు చేసి విచార‌ణ జ‌రుపుతున్నారు. తాను చేసిన త‌ప్పును సందీప్ ఒప్పుకున్నాడు.  


More Telugu News