ఎన్నికల కోడ్ ఎఫెక్ట్.. అమరావతి రైతుల పాదయాత్రపై పోలీసుల ఆంక్షలు!

  • 11వ రోజుకు చేరుకున్న రాజధాని రైతుల పాదయాత్ర
  • ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్
  • రాజకీయ పార్టీలు పాల్గొంటే చర్యలు తీసుకుంటామన్న పోలీసులు
ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన 'న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు' మహాపాదయాత్ర 11వ రోజుకు చేరుకుంది. ఈ నెల 1న పాదయాత్ర ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పాదయాత్ర ప్రకాశం జిల్లాలో కొనసాగుతోంది. నిన్న పాదయాత్ర మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 14 కిలోమీటర్ల మేర కొనసాగింది. పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులకు స్థానిక గ్రామస్తులు పెద్ద ఎత్తున సంఘీభావం తెలుపుతున్నారు. అయితే, పాదయాత్రపై పోలీసులు ఆంక్షలు విధించారు.
 
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో, ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడంతో పోలీసులు ఆంక్షలు విధించారు. రైతుల పాదయాత్రలో రాజకీయ పార్టీలు, నాయకులు పాల్గొనరాదని ఆదేశించారు. ఈ మేరకు అమరావతి జేఏసీ నేతలకు నోటీసులు ఇచ్చారు. తమ ఆంక్షలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో హెచ్చరించారు. పాదయాత్రలో రాజకీయ పార్టీలు పాల్గొని, వారి రాజకీయ అంశాలను చొప్పించే ప్రయత్నం చేస్తే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాజధాని ప్రాంతానికి చెందిన 157 మంది రైతులు మాత్రమే పాదయాత్రలో పాల్గొనాలని చెప్పారు.
 
మరోవైపు ప్రకాశం జిల్లా టీడీపీ నేతలపై పోలీసులు నిఘా ఉంచారు. వారి కదలికలను గమనిస్తున్నారు. ఇంకోవైపు పోలీసుల ఆంక్షలపై రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ పాదయాత్రకు పార్టీలతో సంబంధం లేదని వారు చెప్పారు. పార్టీలకు అతీతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా కొనసాగుతున్న పాదయాత్రపై ఆంక్షలు విధించడం సరికాదని మండిపడ్డారు. పార్టీలకు నోటీసులు ఇవ్వకుండా... తమకు నోటీసులు ఇవ్వడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.


More Telugu News