నా 'శ్రీమంతుడు' సినిమా ఇలాంటి మంచి పనులు చేయిస్తుండడం సంతోషంగా ఉంది: మహేశ్ బాబు

  • 2015లో మహేశ్ హీరోగా శ్రీమంతుడు చిత్రం
  • ఊరికి ఏదైనా మంచి చేయాలన్న కాన్సెప్టుతో సినిమా
  • శ్రీమంతుడు స్ఫూర్తితో ముందుకొచ్చిన కాంట్రాక్టరు సుభాష్ రెడ్డి
  • రూ.12 కోట్లతో కాలేజీ భవనం
  • అభినందించిన మహేశ్ బాబు
కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా 2015లో వచ్చిన శ్రీమంతుడు చిత్రం ఎంతో ప్రజాదరణ పొందింది. మనకు ఎంతో ఇచ్చిన ఊరికి మనం తప్పకుండా తిరిగి ఇవ్వాలన్న కాన్సెప్టుతో ఈ చిత్రం వచ్చింది. కాగా, శ్రీమంతుడు చిత్రం స్ఫూర్తితో కామారెడ్డి జిల్లాలో కాంట్రాక్టరు సుభాష్ రెడ్డి ఏకంగా రూ.12 కోట్లతో జూనియర్ కాలేజీ నిర్మిస్తున్నారు. సొంత డబ్బులతో కాలేజీ నిర్మించి, దాన్ని ప్రభుత్వానికి అప్పగించనున్నారు.

ఈ విషయం తెలిసిన మహేశ్ బాబు ఎంతో సంతోషించారు. బీబీ పేట మండలంలో నిర్మాణం జరుపుకుంటున్న ఆ కాలేజీకి తన శ్రీమంతుడు చిత్రమే కారణమని తెలుసుకుని ఆనందంతో ఉప్పొంగిపోయారు. కాలేజీ నిర్మాణం పూర్తయ్యాక శ్రీమంతుడు చిత్రబృందంతో కలిసి సందర్శిస్తానని మహేశ్ బాబు పేర్కొన్నారు. కాంట్రాక్టరు సుభాష్ రెడ్డికి అభినందనలు తెలిపారు.

కాగా, మహేశ్ బాబు నిన్న మెదక్ జిల్లా పోతారం గ్రామంలో సర్కారు వారి పాట షూటింగ్ లో పాల్గొన్నారు. క్లైమాక్స్ షెడ్యూల్ జరుగుతుండగా, మహేశ్ బాబుపై ఆ గ్రామంలో కొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు. మహేశ్ బాబు రాకతో పోతారం గ్రామంలో సందడి నెలకొంది.


More Telugu News