నిన్న‌టి ఆ ఘోర‌ ప్ర‌మాద స‌మ‌యంలో వాహ‌నంలో నేను లేను: మంత్రి అవంతి

  • విశాఖపట్నంలో నిన్న వాహనం ఢీకొని ఒక‌రి మృతి
  • అవంతి ఇంటి ముందు మృతుడి కుటుంబ స‌భ్యుల ఆందోళ‌న‌
  • వారితో అవంతి చ‌ర్చ‌లు
  • మృతుడి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామ‌ని హామీ
విశాఖపట్నంలో నిన్న‌ ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ వాహనం ఢీకొని సూర్యనారాయణ అనే వ్యక్తి మృతి చెందాడు. దీంతో ఈ రోజు ఉదయం అవంతి ఇంటి ముందు మృతుడి కుటుంబ స‌భ్యులు, బంధువులు నిరసనకు దిగారు. అవంతి వాహనం ఢీకొట్ట‌డం వ‌ల్లే సూర్యనారాయణ మృతి చెందాడని చెప్పారు. ప్రభుత్వం తరఫున త‌మ‌కు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ప్ర‌స్తుతం మంత్రి అవంతి ఇంటి ముందు  పోలీసులు భారీగా మోహరించారు.
 
మరోపక్క, ఇదే విషయంపై అవంతి శ్రీనివాస్ ఇంటి సమీపంలో జనసేన నేతలు కూడా ఆందోళనకు దిగారు. జనసేన నేతలు సందీప్, ఉషారాణిని మంత్రి ఇంటికి వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్ల వద్దే జనసేన కార్యక‌ర్త‌ల‌ను పోలీసులు అడ్డుకోవడంతో పోలీసులతో వారు వాగ్వివాదానికి దిగారు.

దీంతో అవంతి శ్రీ‌నివాస్ మృతుడి బంధువుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపారు. ఆ ఘోర‌ ప్ర‌మాదం జ‌రిగిన‌ స‌మ‌యంలో వాహ‌నంలో తాను లేనని ఆయ‌న చెప్పారు. మృతుడి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామ‌ని హామీ ఇచ్చారు. ప్ర‌మాద ఘ‌ట‌న‌పై పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నార‌ని ఆయ‌న చెప్పారు. తాము మాన‌వ‌తా దృక్ప‌థంతోనే ఆర్థిక సాయం అందిస్తామ‌ని చెబుతున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. మృతుడి కుటుంబానికి  రూ.10 ల‌క్ష‌లు ఇవ్వాల‌ని బంధువులు డిమాండ్ చేశారు.


More Telugu News