ట్విట్ట‌ర్‌లో ప్ర‌భావ‌శీల ప్ర‌ముఖుల్లో మోదీకి ద్వితీయ స్థానం

  • వెల్ల‌డించిన‌ బ్రాండ్‌వాచ్  సంస్థ‌
  • అత్యంత ప్ర‌భావ‌శీల 50 మంది వ్యక్తుల పేర్లు విడుద‌ల‌
  • అమెరికా గాయని టేలర్ స్విఫ్ట్ నంబ‌ర్ 1
  • సచిన్ టెండూల్క‌ర్ కు 35వ స్థానం
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సామాజిక మాధ్యమాల్లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పే అవ‌స‌రంలేదు. ఆయ‌న‌కు ట్విట్ట‌ర్‌లో 72.5 మిలియ‌న్ల ఫాలోవ‌ర్లు ఉన్నారు. ఆయ‌న సామాజిక మాధ్య‌మాల ద్వారా ఇచ్చే సందేశాల‌ను, చేసే సూచ‌న‌ల‌ను చాలా మంది పాటిస్తారు.

దీంతో ఈ ఏడాది ట్విట్ట‌ర్‌లో ప్ర‌పంచంలోనే అత్యంత ప్ర‌భావ‌శీల ప్ర‌ముఖుల్లో ప్ర‌ధాని మోదీ రెండో స్థానంలో నిలిచారు. ఆన్‌లైన్ నిఘా సంస్థ బ్రాండ్‌వాచ్ వార్షిక పరిశోధన నివేదిక‌లో ఈ విష‌యాన్ని పేర్కొంది. ట్విట్ట‌ర్‌లో అత్యంత ప్ర‌భావ‌శీల 50 మంది వ్యక్తుల పేర్ల‌ను ప్రచురించింది.

ఈ జాబితాలో అమెరికా గాయని టేలర్ స్విఫ్ట్ అగ్ర‌ స్థానంలో నిలిచారు. భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సచిన్ టెండూల్క‌ర్‌ 35వ స్థానంలో ఉన్నారు. టాప్-50లో డ్వేన్ జాన్సన్, లియోనార్డో డి కాప్రియో, అమెరికా మాజీ ప్రథమ మహిళ మిచెల్ ఒబామా వంటివారు ఉన్నారు.

కాగా, సచిన్ టెండూల్కర్ 10 ఏళ్ల‌కుపైగా యునిసెఫ్ తో క‌లిసి ప‌నిచేస్తోన్న విష‌యం తెలిసిందే. ఆయ‌న 2013లో దక్షిణాసియా అంబాసిడర్ గా నియమితుడ‌య్యారు.  ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌కు కూడా ఈ జాబితాలో చోటు ద‌క్కింది.


More Telugu News