భారత టీ20 జట్టు కెప్టెన్ గా రోహిత్ శర్మ... న్యూజిలాండ్ తో సిరీస్ కు జట్టు ఎంపిక

  • ఈ నెల 17 నుంచి కివీస్ తో టీ20 సిరీస్
  • 16 మందితో టీమిండియా ఎంపిక
  • కోహ్లీకి విశ్రాంతి
  • వైస్ కెప్టెన్ గా కేఎల్ రాహుల్
  • వెంకటేశ్ అయ్యర్, గైక్వాడ్ లకు చోటు
భారత టీ20 జట్టు సారథ్య బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోవడంతో నూతన కెప్టెన్ గా రోహిత్ శర్మను నియమించారు. ఈ నెలలో న్యూజిలాండ్ తో సొంతగడ్డపై జరిగే మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో రోహిత్ శర్మ నాయకత్వంలో టీమిండియా బరిలో దిగనుంది. నేడు సమావేశమైన సెలెక్టర్లు 16 మందితో జట్టును ఎంపిక చేశారు. విధ్వంసక ఓపెనర్ కేఎల్ రాహుల్ ను వైస్ కెప్టెన్ గా నియమించారు. కోహ్లీ విశ్రాంతి పేరిట ఈ సిరీస్ నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. బీసీసీఐ నేడు ప్రకటించిన జట్టులో కోహ్లీ పేరు లేదు.

ఈ నెల 17, 19, 21 తేదీల్లో టీమిండియా, న్యూజిలాండ్ మధ్య 3 టీ20 మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ మ్యాచ్ లకు జైపూర్, రాంచీ, కోల్ కతా ఆతిథ్యమిస్తున్నాయి. ఈ సిరీస్ ముగియగానే రెండు టెస్టుల సిరీస్ జరగనుంది. ఇక టీ20 సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో ఐపీఎల్ సంచలనం వెంకటేశ్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్ లకు స్థానం కల్పించారు.

బౌలింగ్ విభాగంలో హర్షల్ పటేల్ ను పరిశీలించనున్నారు. ఆర్సీబీ జట్టు తరఫున హర్షల్ ఐపీఎల్ లో విశేషంగా రాణించాడు. ఇక, ఇటీవల ఏమంత ప్రభావం చూపలేకపోతున్న భువనేశ్వర్ కుమార్ కు సెలెక్టర్లు మరో అవకాశం ఇచ్చారు. బౌలింగ్ చేయలేకపోతున్న ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యను సెలెక్టర్లు పక్కనబెట్టారు.

న్యూజిలాండ్ తో సిరీస్ కు టీమిండియా ఇదే...

రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, ఇషాన్ కిషన్, వెంకటేశ్ అయ్యర్, యజువేంద్ర చహల్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, ఆవేశ్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చహర్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్.


More Telugu News