గాలితో నడిచే ఇంజన్ ను తయారు చేసిన చాయ్ వాలా!

  • మనిషి ఊపిరితిత్తులే నమూనా
  • సక్సెస్ అయిన ఆగ్రాకు చెందిన త్రిలోకి
  • ఇంటిని అమ్మి ఇంజన్ తయారీ
  • పేటెంట్ కోసం దరఖాస్తుకు ప్రయత్నాలు
బైకు, కారు రయ్ మంటూ దూసుకెళ్లాలంటే పెట్రోల్ పోయించాలి. బస్సులు, లారీలు, రైళ్లకు డీజిల్ కావాలి. పైగా ఇంజనాయిల్ పదే పదే మార్చాలి. ఇప్పుడేమో పెట్రోల్, డీజిల్ రేట్లను చూస్తుంటే.. గుండెలు గుభేల్ అనే పరిస్థితి. వాటన్నింటికీ మించి కాలుష్యం. దాని నుంచి ఇటు మన ఆరోగ్యం.. అటు పర్యావరణం పాడైపోవడం.. ఎన్ని నష్టాలో కదా.

వీటన్నింటికీ ఒకే ఒక్క పరిష్కారం ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటున్నారు. కానీ, ఆగ్రాకు చెందిన ఓ టీకొట్టు యజమాని మాత్రం తాను తయారు చేసిన ఈ ‘గాలితో నడిచే ఇంజనే’ అన్ని సమస్యలకు పరిష్కారం అంటున్నారు. ఆ ఇంజన్ ను బైకులు, కార్లు, రైళ్ల వరకు దేనికైనా పెట్టుకోవచ్చని చెబుతున్నారు. ఇంజన్ ఆకారాన్ని మారిస్తే చాలంటున్నారు.

ఆయన చదివింది డిగ్రీ అయినా.. బతుకు బండి నడిపేందుకు ఓ టీకొట్టు నడుపుతున్నాడు. సైకిల్ రిపేర్ షాపూ నిర్వహిస్తున్నాడు. ఆయన పేరు త్రిలోకి ప్రసాద్ (50). ఉండేది ఆగ్రాలోని ఫతేపూర్ సిక్రి. ఆయన ఈ ఇంజన్ తయారు చేయడం వెనుక ఓ పెద్ద కథే ఉంది.


యుక్త వయసులో ఉండగానే త్రిలోకి ప్రసాద్ ఓ బోరు ఇంజన్ ను తయారు చేశారు. 15 ఏళ్ల క్రితం సైకిల్ టైర్లకు పంక్చర్లను వేయడం మొదలుపెట్టారు. ఒకరోజు సైకిల్ ట్యూబ్ లోకి గాలి ఎక్కిస్తుండగా.. ఆ మోటార్ వాల్వ్ ఊడిపోయి గాలి బయటకు లీకైంది. ఆ ఒత్తిడికి మోటార్ రివర్స్ కావడం మొదలైంది. అది గమనించిన త్రిలోకి.. ఆ గాలి శక్తితోనే ఇంజన్ ను ఎందుకు తయారు చేయకూడదని ఆలోచించారు.

తన యంత్రాన్ని కరెంట్ గానీ డీజిల్ గానీ అవసరం లేకుండానే.. గాలితోనే నడపాలని డిసైడ్ అయ్యారు. తన స్నేహితులతో కలిసి దానిని ఆచరణలో పెట్టారు. మనిషి ఊపిరితిత్తులను పోలి ఉండే రెండు గాలి తిత్తులను తయారు చేసి.. వాటిని యంత్రానికి అనుసంధానించారు. దానికి ఓ లీవర్ ను పెట్టి.. ప్రెస్ చేయడం ద్వారా గాలి పీడనాన్ని పెంచారు. దీంతో ఇంజన్ స్టార్టయ్యి.. మనిషి ఊపిరితిత్తులలాగానే బయటకు గాలిని వదిలేయడం ప్రారంభించింది. అలా తొలిసారి సక్సెస్ ను అందుకున్నారు.

రానురాను ఆయన ఆలోచన కాస్తా.. మోటారు వాహనాల ఇంజన్ గా మారిపోయింది. ఇది తన 15 ఏళ్ల కష్టమని త్రిలోకి చెబుతున్నారు. తనకు వారసత్వంగా వచ్చిన ఇంటిని అమ్మి దీనిని తయారు చేశామన్నారు. 2019లోనే నేషనల్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో పేటెంట్ కు దరఖాస్తు చేసుకున్నామని, కానీ, ఆ సమయంలో ఇంజన్ స్టార్ట్ కాలేదని చెప్పారు. ఇప్పుడు పూర్తిగా సక్సెస్ అయ్యామని, మళ్లీ పేటెంట్ కు దరఖాస్తు చేస్తామని తెలిపారు.

తమ బృందంలో త్రిలోకి ఒక్కడే డిగ్రీ దాకా చదువుకున్నాడని, మిగతా వాళ్లెవరూ కనీసం పది కూడా పాస్ కాలేదని త్రిలోకి స్నేహితుడు సంతోష్ చహర్ చెప్పారు. ఇంజన్ లో ఘర్షణను తగ్గించేందుకు ల్యూబ్రికెంట్ (ఇంజన్ ఆయిల్) వాడాల్సి ఉంటుందని, అయితే, పెట్రోల్, డీజిల్ ఇంజన్లలోలాగా వాడాక ఇంజనాయిల్ నల్లగా మారదని చెప్పారు.


More Telugu News