పని ఒత్తిడిని తగ్గించుకోవడానికి నాకు ఇదే సరైన సమయం: కోహ్లీ

  • గత ఆరేడు సంవత్సరాల నుంచి విపరీతమైన క్రికెట్ ఆడాం
  • మా ఓటమిని టాస్ పైకి నెట్టేయలేం
  • కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నా.. నా ఆటతీరులో మార్పు రాదు
టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుని, పని ఒత్తిడిని తగ్గించుకోవడానికి తనకు ఇదే సరైన సమయమని విరాట్ కోహ్లీ తెలిపాడు. గత ఆరేడు సంవత్సరాల నుంచి విపరీతమైన క్రికెట్ ఆడామని... ఫీల్డ్ లోకి దిగిన ప్రతిసారీ ఎంతో ఒత్తిడికి గురవుతుంటామని చెప్పాడు. అత్యున్నతమైన ఆటగాళ్లతో కలిసి ఆడటం చాలా గొప్ప అనుభూతిని ఇచ్చిందని అన్నాడు. ఒక జట్టుగా అందరం మంచి ప్రదర్శన ఇచ్చామని తెలిపాడు.

ప్రస్తుత టీ20 ప్రపంచకప్ లో నిరాశపరిచినా... అనేక మ్యాచ్ లలో మంచి ఫలితాలను సాధించామని చెప్పాడు. టీ20లో రెండు ఓవర్లలోనే ఫలితం తారుమారవుతుందని అన్నాడు. తమ ఓటమిని టాస్ పైకి నెట్టేయలేమని అన్నాడు. పదవీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్న హెడ్ కోచ్ రవిశాస్త్రితో పాటు ఇతర సపోర్టింగ్ స్టాఫ్ కు కోహ్లీ కృతజ్ఞతలు తెలిపాడు.

కొన్నేళ్లుగా జట్టు సాధించిన ఘన విజయాల వెనుక వారి పాత్ర కూడా ఉందని చెప్పాడు. భారత క్రికెట్ కు వారు విశేషమైన సేవలను అందించారని కొనియాడాడు. టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత కూడా తన ఆటతీరులో మార్పు రాదని చెప్పాడు. ఎప్పటి మాదిరే జట్టు విజయం కోసం తన వంతు పాత్రను పోషిస్తానని తెలిపాడు.


More Telugu News