చంచల్ గూడ జైలు నుంచి తీన్మార్ మల్లన్న విడుదల... ఘనస్వాగతం పలికిన అనుచరులు

  • తీన్మార్ మల్లన్నకు బెయిల్
  • ప్రశ్నించే గొంతుకను నొక్కుతున్నారని ఆరోపణ
  • 73 రోజులు జైలుపాలు చేశారని మండిపాటు  
  • చివరి నిమిషంలోనూ అడ్డుకునే ప్రయత్నాలు చేశారని వ్యాఖ్యలు
తీన్మార్ మల్లన్నకు కోర్టు బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనకు జైలు వెలుపల అనుచరులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. వారి కోలాహలం నడుమ ఆయన తన నివాసానికి తరలి వెళ్లారు. విడుదలైన సందర్భంగా తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్ కుమార్) మీడియాతో మాట్లాడుతూ, ప్రశ్నించే గొంతుకను నొక్కే ప్రయత్నంలో భాగంగానే తనను అరెస్ట్ చేశారని, 73 రోజులు జైలుపాలు చేశారని వెల్లడించారు.

"సీఎం కేసీఆర్, ఆయన సుపుత్రుడు కేటీఆర్ అధికారాన్ని అడ్డంపెట్టుకుని అరాచకం సృష్టించాలని చూస్తున్నారు. నేను విడుదలయ్యే చివరి నిమిషంలో కూడా అడ్డుకోవాలని ప్రయత్నించారు. అయినా 73 రోజులు జైల్లో ఉన్నాను.. ఇంకో పది రోజులు ఓ లెక్కా? 37 కేసులు పెట్టారు... మరో 3 కేసులు ఓ లెక్కా? సమాజంలో తప్పు చేసే వాళ్లే భయపడతారు. నేను ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టే భయపడడంలేదు. భవిష్యత్తులో పరువునష్టం దావా వేస్తా" అని వెల్లడించారు.

తీన్మార్ మల్లన్నపై ఇప్పటివరకు 30కి పైగా కేసులు నమోదయ్యాయి. వాటిలో ఆరు కేసులను కోర్టు కొట్టివేసింది.


More Telugu News