'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' అఫిషియల్ ట్రైలర్ ఆవిష్కరించిన నాగార్జున

  • నిహారిక కొణిదెల నిర్మాణంలో వెబ్ సిరీస్
  • ట్రైలర్ ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్న నాగ్
  • ఈ నెల 19న జీ5 ఓటీటీ యాప్ లో ప్రీమియర్స్
  • సంతోష్ శోభన్, సిమ్రన్ శర్మ జంటగా ఓసీఎఫ్ఎస్
  • దర్శకత్వం వహించిన మహేశ్ ఉప్పల
నిహారిక కొణిదెల నిర్మాతగా రూపుదిద్దుకున్న వెబ్ సిరీస్ 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' (ఓసీఎఫ్ఎస్). ఈ వెబ్ సిరీస్ అఫిషియల్ ట్రైలర్ ను కింగ్ నాగార్జున ఈ సాయంత్రం ఆవిష్కరించారు. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ ద్వారా జీ5 ఎంటర్టయిన్ మెంట్ మనందరికీ ఒక పెద్ద ఫ్యామిలీ ప్యాక్ లాంటి వినోదాన్ని అందించబోతోందని నాగార్జున పేర్కొన్నారు. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ ట్రైలర్ ను ఆవిష్కరించడం సంతోషంగా ఉందని తెలిపారు. సంతోష్ శోభన్, సిమ్రన్ శర్మ, గీత్ సైనీ, సీనియర్ నటులు నరేశ్, తులసి, గెటప్' శీను నటించిన ఈ వెబ్ సిరీస్ జీ5 ఓటీటీ యాప్ లో నవంబరు 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్ కు మహేశ్ ఉప్పల దర్శకత్వం వహించాడు.

ట్రైలర్ విడుదల చేసిన సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ "మనందరిదీ ఒక పెద్ద ఫ్యామిలీ. సినిమా ఫ్యామిలీ. కానీ, ఈ మహేష్ ది చిన్న ఫ్యామిలీ అంట. మరి, ఈ చిన్న ఫ్యామిలీ స్టోరీ ఏంటో చూద్దాం రండి. మామూలుగా లేదుగా ట్విస్ట్. మరి, ఈ బరువు బాధ్యత మహేష్ తీసుకుంటాడంటారా? నవంబర్ 19న 'జీ 5'లో 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ'ని ఎక్స్‌క్లూజివ్‌గా చూద్దాం. నిహారిక, మహేష్ ఉప్పాల, టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్. ట్రైలర్ చూశాక ఈ ఫ్యామిలీ స్టోరీ చూడాలని నేను కూడా వెయిటింగ్" అని అన్నారు.

'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' (OCFS) గురించి నిహారికా కొణిదెల మాట్లాడుతూ "ట్రైలర్ విడుదల చేసిన నాగార్జునగారికి చాలా చాలా థాంక్స్. మేం అడిగిన వెంటనే ఒప్పుకొన్నారు. 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ'కి వస్తే... ఇదొక ఫ్యామిలీ ఎంటర్టైనర్ సిరీస్. కామెడీ డ్రామా అని చెప్పవచ్చు. పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ నవ్వుకునేలా ఉంటుంది. సంగీత్ శోభన్, సిమ్రన్ శర్మ, నరేష్ గారు, తులసిగారు పాత్రల్లో జీవించారు. సిరీస్‌లో ఐదు ఎపిసోడ్స్ ఉన్నాయి. నవంబర్ 19న విడుదల చేస్తున్నాం. 'జీ 5'లో సిరీస్ విడుదల కానుండడం ఎంతో సంతోషంగా ఉంది" అని చెప్పారు.

దర్శకుడు మహేష్ ఉప్పాల మాట్లాడుతూ "నాగబాబుగారి పుట్టినరోజు సందర్భంగా వెబ్ సిరీస్ టైటిల్ వెల్లడించడంతో పాటు ఫస్ట్ లుక్ విడుదల చేశాం. తర్వాత నాని గారు టీజర్ విడుదల చేశారు. ఇప్పుడు నాగార్జున గారు ట్రైలర్ విడుదల చేశారు. మా సిరీస్ ప్రేక్షకులకు చేరువయ్యేలా చేసిన స్టార్ హీరోలకు థాంక్స్. ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్... ప్రతిదానికి ప్రేక్షకుల స్పందన బావుంది. సిరీస్ కూడా ఆకట్టుకుంటుంది. మధ్య తరగతి కుటుంబం నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సిరీస్ పిల్లలతో పాటు పెద్దల్ని కూడా ఆకట్టుకుంటుంది" అని చెప్పారు. మానసా శర్మతో కలిసి ఈ వెబ్ సిరీస్ కు మహేష్ ఉప్పాల కథ, మాటలు అందించారు.


More Telugu News