జగన్ సీఎం అయిన తర్వాత పెట్రోల్, డీజిల్ పై రూ. 28 వేల కోట్లకు పైగా పన్నులు వసూలు చేశారు: పట్టాభి

  • పెట్రోల్, డీజిల్ పై కేవలం రూపాయి మాత్రమే తీసుకుంటున్నామని సిగ్గు లేకుండా సాక్షిలో యాడ్ వేశారు
  • ఏపీనే ఎక్కువ పన్నులు వేస్తోందని కేంద్ర పెట్రోలియం మంత్రి చెప్పారు
  • వైసీపీ దాడులకు భయపడే ప్రసక్తే లేదు
20 రోజుల క్రితం జరిగిన దారుణ ఘటనలు ఎవరూ మరచిపోలేరని టీడీపీ నేత పట్టాభి అన్నారు. తన నివాసంపై దాడి జరిగిన తర్వాత తన కుటుబంతో కలిసి బయటకు వెళ్లానని చెప్పారు. ఇక తన పని అయిపోయిందని, తన గొంతు కూడా వినిపించదని పేటీఎం బ్యాచ్ ఎంతో సంతోషపడిందని అన్నారు. అలాగే వైసీపీ నేతలు కూడా సంబరపడ్డారని చెప్పారు.

ఒక నిజాయతీ కలిగిన పసుపు సైనికుడిగా మాట్లాడుతున్నానని... తాను వెనకడుగు వేసే ప్రసక్తే లేదని అన్నారు. ఏ స్థాయిలో ఉన్న నాయకుడు తప్పు చేసినా, ప్రజాధనాన్ని లూటీ చేసినా, అవినీతికి పాల్పడినా... ఆధారాలతో సహా బయటపెడుతూనే ఉంటానని చెప్పారు.

ఇప్పటి వరకు తనపై మూడుసార్లు వైసీపీ వాళ్లు దాడి చేశారని... వాస్తవాలను నిర్భయంగా ప్రజల ముందుకు తీసుకొస్తున్నాం కాబట్టే తనపై దాడులు జరిగాయని పట్టాభి అన్నారు. తనతో పాటు పలువురు టీడీపీ నేతలపై కూడా దాడులు జరిగాయని దుయ్యబట్టారు. వైసీపీ అరాచకాలకు సైతం తట్టుకుని, టీడీపీ జెండాను కిందకు దించకుండా, పోరాటం చేస్తున్న పసుపు సైనికులందరికీ హ్యాట్సాఫ్ చెపుతున్నానని అన్నారు.
 
గత రెండున్నరేళ్లుగా రకరకాల పన్నులతో రాష్ట్ర ప్రజలపై ముఖ్యమంత్రి జగన్ భారం మోపుతున్నారని పట్టాభి మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్ పై ఆయన అవినీతి పత్రికలో పూర్తి పేజీలో తప్పడు యాడ్ ఇచ్చారని విమర్శించారు. పెట్రోల్, డీజిల్ పై రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం భారం మోపలేదని... రోడ్ల కోసం కేవలం ఒక్క రూపాయి మాత్రమే తీసుకుంటున్నామని సిగ్గులేకుండా ఆ ప్రకటనలో పేర్కొన్నారని మండిపడ్డారు. దేశంలోనే గత సంవత్సర కాలంలో పెట్రోల్, డీజిల్ ధరలను అత్యధికంగా పెంచింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వమని పార్లమెంటు సాక్షిగా కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి అధికారికంగా ప్రకటించారని... దీనికి ముఖ్యమంత్రి ఏం చెపుతారని ప్రశ్నించారు.

ఏపీ ప్రభుత్వం 2019-20లో పెట్రోల్, డీజిల్ పై విధించిన పన్నుల ద్వారా రూ. 10,168 కోట్లు, 2020-21లో రూ. 11,014 కోట్లు, ప్రస్తుత సంవత్సరంలో ఇప్పటికే దాదాపు రూ. 7 వేల కోట్లను సమకూర్చుకుందని పట్టాభి అన్నారు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం లీటర్ పెట్రోల్ పై రూ. 21.50... లీటర్ డీజిల్ పై రూ. 29.32 పన్నులు వసూలు చేస్తోందని చెప్పారు.

జగన్ సీఎం అయినప్పటి నుంచి రూ. 28 వేల కోట్ల పైన పెట్రోల్, డీజిల్ పై పన్నుల రూపంలో కొల్లగొట్టారని మండిపడ్డారు. దీనికి అదనంగా రోడ్ల సెస్ పేరుతో ప్రతి లీటర్ పై ఒక రూపాయి వసూలు చేస్తున్నారని అన్నారు. వైసీపీ దాడులకు భయపడే ప్రసక్తే లేదని... నిజాలను నిర్భయంగానే మాట్లాడుతుంటానని చెప్పారు.


More Telugu News