పునీత్ రాజ్ కుమార్ కు పద్మశ్రీ ఇవ్వాలంటున్న కర్ణాటక మంత్రులు

  • బీసీ పాటిల్, ఆనంద్ సింగ్ డిమాండ్
  • పునీత్ సమాజసేవ కోసం పాటుపడ్డారన్న మంత్రులు
  • జీవించి ఉన్నప్పుడే ఇవ్వాల్సిందని వెల్లడి
  • ఇటీవల గుండెపోటుతో మరణించిన పునీత్
అభిమానులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులను తీవ్ర విషాదంలో ముంచెత్తి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ కు పద్మశ్రీ ఇవ్వాలని కర్ణాటక మంత్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. కర్ణాటక వ్యవసాయ మంత్రి బీసీ పాటిల్, టూరిజం శాఖ మంత్రి ఆనంద్ సింగ్ దీనిపై స్పందించారు. పునీత్ నటుడిగానే కాకుండా సమాజానికి ఎన్నో రకాలుగా సేవలు అందించాడని బీసీ పాటిల్ కొనియాడారు. వాస్తవానికి పునీత్ కు ఇంతకుముందే పద్మశ్రీ ఇచ్చి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. మరణానంతరం అయినా పద్మశ్రీ ఇవ్వాలని కోరారు.

ఆనంద్ సింగ్ మాట్లాడుతూ, వ్యక్తిగతంగానే కాకుండా, ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల్లోనూ పునీత్ రాజ్ కుమార్ పాలుపంచుకున్నారని వివరించారు. మానవాళికి సేవ చేయడాన్ని ఎంతో బాధ్యతగా భావించే వ్యక్తి పునీత్ అని, ఆయనకు పద్మశ్రీ ఇచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సి ఉందని అన్నారు.

కన్నడ నాట పవర్ స్టార్ గా ఇమేజ్ సంపాదించుకున్న పునీత్ రాజ్ కుమార్ అనేక ఉచిత పాఠశాలలు, అనాథ ఆశ్రమాలు, వృద్ధాశ్రమాలు నెలకొల్పారు. దాదాపు 1500 మందికి పైగా నిరుపేద విద్యార్థులను చదివిస్తున్నారు.


More Telugu News