అందని వరల్డ్ కప్... నిరాశతో నిష్క్రమిస్తున్న కోహ్లీ, రవిశాస్త్రి

  • టీ20 వరల్డ్ కప్ నుంచి టీమిండియా అవుట్
  • ఆఫ్ఘన్ ఓటమితో భారత్ సెమీస్ అవకాశాలకు తెర
  • టీ20 జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్న కోహ్లీ
  • కోచ్ గా రవిశాస్త్రికి ఇదే చివరి ఈవెంట్
ప్రపంచంలో ఎలాంటి బౌలింగ్ దాడులనైనా తుత్తునియలు చేయగల బ్యాటర్లు, మేటి బ్యాట్స్ మెన్ ను సైతం గడగడలాడించగల బౌలర్లు... టీమిండియా లైనప్ గురించి చెప్పుకోవాల్సి వస్తే ఎవరైనా ఇదే చెబుతారు. కానీ క్రికెట్ విచిత్రమైన క్రీడ. వరుసగా రెండు మ్యాచ్ లలో ఓడిపోయిన భారత్ ఏకంగా ప్రపంచకప్ నుంచే నిష్క్రమించింది. ఇవాళ ఆఫ్ఘనిస్థాన్ ఓడిపోవడంతో భారత్ సెమీస్ ఆశలకు తెరపడింది. దాంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

ఇదంతా ఒకెత్తయితే... కెప్టెన్ గా ఒక్క వరల్డ్ కప్ సాధించలేని విరాట్ కోహ్లీ, కోచ్ గా ఆ ఘనత అందుకోలేని రవిశాస్త్రి అంతకంటే తీవ్ర నిరాశతో నిష్క్రమిస్తున్నారు. కోచ్ గా రవిశాస్త్రికి ఇదే చివరి టోర్నీ. అటు టీ20 ఫార్మాట్ లో కోహ్లీకి కెప్టెన్ గా ఇదే చివరి ఈవెంట్. టీ20 వరల్డ్ కప్ తర్వాత భారత టీ20 జట్టుకు కొత్త కెప్టెన్ రానున్నాడు. అటు, శాస్త్రి స్థానంలో కొత్త కోచ్ గా రాహుల్ ద్రావిడ్ వస్తున్నాడు.

సూపర్-12 దశలో టీమిండియా రేపు తన చివరి లీగ్ మ్యాచ్ లో నమీబియాతో తలపడనుంది. ఈ పోరులో గెలిచి ఊరట పొందడం, కెప్టెన్ గా కోహ్లీకి, కోచ్ గా శాస్త్రికి ఘనంగా వీడ్కోలు పలకడం తప్ప ఇక టీమిండియా చేయదగింది ఈ టోర్నీలో ఏమీలేదు.

అభిమానులకు అర్థంకాని విషయం ఏమిటంటే... గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి టీమిండియాకు మెంటార్ ను నియమించారు. మెంటార్ గా ధోనీ వస్తే టీమిండియా రెట్టించిన ఉత్సాహంతో ఆడుతుందని అందరూ భావించారు. కానీ, అత్యంత దారుణమైన పరాజయాలు చవిచూసింది. కోచ్ గా రవిశాస్త్రి ఉన్నప్పుడు ధోనీ ఎందుకన్నది చాలామందిలో సందేహం నెలకొంది.

శాస్త్రి, ధోనీల్లో ఎవరి సలహాలు వినాలో తెలియని సందిగ్ధ స్థితిలోనే టీమిండియా ఆటగాళ్లు పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల చేతిలో ఓడిపోయారని ఓ వాదన వినిపిస్తోంది. ఈ రెండు మ్యాచ్ లలో ఓడిన తీరు చూస్తే టీమిండియా ఒక నిర్దిష్ట వ్యూహం లేకుండానే బరిలో దిగినట్టు అర్థమవుతోంది. దీనికి తోడు జట్టులో చీలికలు ఏర్పడ్డాయంటూ మాజీ క్రికెటర్లు కూడా అంటున్నారు. ఏదేమైనా విరాట్ కోహ్లీ, రవిశాస్త్రి వంటి ఇద్దరు దిగ్గజాలకు ఈ టోర్నీ ఓ చేదు అనుభవంగా మిగిలిపోతుంది.


More Telugu News