నిబంధనలు ఉల్లంఘించారంటూ.. పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులపై కేసుల నమోదు

  • అమరావతి కోసం రైతుల పాదయాత్ర
  • తుళ్లూరు నుంచి తిరుమల వరకు పాదయాత్ర
  • ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో రైతుల యాత్ర
  • హైకోర్టు షరతుల ఉల్లంఘనతో పాటు కానిస్టేబుల్ పై దాడి చేశారన్న ఎస్పీ  
అమరావతి రైతులు చేపడుతున్న మహా పాదయాత్ర ప్రకాశం జిల్లాలో కొనసాగుతోంది. అయితే నిబంధనలు ఉల్లంఘించారంటూ రైతులపై ప్రకాశం జిల్లా పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. హైకోర్టు షరతులు ఉల్లంఘించారంటూ ఒక కేసు, కానిస్టేబుల్ పై దాడి చేశారంటూ మరో కేసు నమోదైనట్టు ప్రకాశం జిల్లా ఎస్పీ మలికా గార్గ్ వెల్లడించారు.

పాదయాత్ర సందర్భంగా రైతులు హైకోర్టు ఉత్తర్వులను, డీజీపీ ఆదేశాలను ఉల్లంఘిస్తున్నట్టు గుర్తించామని వెల్లడించారు. పాదయాత్ర ప్రకాశం జిల్లాలో ప్రవేశించినప్పటి నుంచి షరతుల ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆరోపించారు. యాత్రకు అనుమతించింది 157 మందిని అయితే, అందుకు 15 రెట్లు ఎక్కువగా 2 వేల మంది వరకు పాల్గొంటున్నారని వెల్లడించారు. జాబితాలో లేని రాజకీయనేతలు కూడా పాదయాత్రలో పాల్గొంటున్నారని అన్నారు.

4 వాహనాలకు అనుమతి ఇస్తే 500 వరకు వాహనాలు పాదయాత్రలో కనిపించాయని, భారీ ఎత్తున బాణసంచా కాల్చారని, పోర్టబుల్ హ్యాండ్ మైకులకు అనుమతి ఇస్తే లౌడ్ స్పీకర్లు వినియోగించారని ఎస్పీ వివరించారు. దానికితోడు పాదయాత్రలో చాలామంది మాస్కులు లేకుండా ఉన్నారని, శానిటైజర్లను వినియోగించడం లేదని తెలిపారు.


More Telugu News