కుండపోత వానకు నీట మునిగిన చెన్నై... నగరంలో రెడ్ అలర్ట్

  • శనివారం రాత్రి నుంచి చెన్నైలో భారీ వర్షం
  • రికార్డు స్థాయిలో 207 మిమీ వర్షపాతం
  • 2015 తర్వాత ఇదే అత్యధికం
  • ముంపు ప్రాంతాల్లో పర్యటించిన సీఎం స్టాలిన్
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, అల్పపీడన పరిస్థితుల కారణంగా తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రాత్రి నుంచి కురుస్తున్న కుండపోత వానకు చెన్నై మహానగరం నీటమునిగింది. దాంతో రెడ్ అలర్ట్ జారీ చేశారు.

నగరంలో ఎక్కడ చూసినా రోడ్లపై నీరే. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. బస్సులు అరకొరగా తిరుగుతుండగా, లోకల్ రైళ్లను నిలిపివేశారు. నగరంలోని కొరత్తూర్, పెరంబూరు, పోరూర్, కోడంబాక్కం, టీ నగర్, గిండీ, పెరుంగుడి ప్రాంతాలు వరద గుప్పిట చిక్కుకున్నాయి. రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ దళాలు సహాయక చర్యలు ముమ్మరం చేశాయి.

ఈ నేపథ్యంలో సీఎం స్టాలిన్ నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. సహాయక చర్యలను, నీటి తోడివేత పనులను స్వయంగా పరిశీలించారు. నిరాశ్రయుల కోసం చేపట్టిన అన్నదాన కార్యక్రమంలో పలువురికి వడ్డించారు. స్టాలిన్ రోడ్లపై నిలిచిన మోకాలి లోతు నీటిలోనూ పర్యటించారు. రాగల కొన్ని గంటల్లో చెన్నై నగరాన్ని మరోసారి భారీ వర్షం ముంచెత్తనుందన్న హెచ్చరికల నేపథ్యంలో, సీఎం స్టాలిన్ అధికారులను అప్రమత్తం చేశారు.

కాగా, ఐఎండీ రికార్డు చేసిన వివరాల ప్రకారం... నగరంలోని నుంగంబాక్కంలో అత్యధికంగా 207 మిమీ వర్షం కురిసింది. 2015 తర్వాత నగరంలో ఇదే అత్యధిక వర్షపాతం అని గణాంకాలు చెబుతున్నాయి. ఇక, ఏపీలో నెల్లూరు జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి.


More Telugu News