వెస్టిండీస్ పై ఆసీస్ ఘనవిజయం... సెమీస్ అవకాశాలు పదిలం

  • మొదట బ్యాటింగ్ చేసిన విండీస్
  • 20 ఓవర్లలో 7 వికెట్లకు 157 రన్స్
  • 16.2 ఓవర్లలో ఛేజింగ్ చేసిన ఆసీస్
  • వార్నర్ విధ్వంసక ఇన్నింగ్స్
  • అర్ధసెంచరీతో రాణించిన మార్ష్
టీ20 వరల్డ్ కప్ సూపర్-12 దశను ఆస్ట్రేలియా విజయంతో ముగించింది. వెస్టిండీస్ తో జరిగిన పోరులో ఆసీస్ జట్టు 8 వికెట్ల తేడాతో నెగ్గింది. విండీస్ తమ ముందుంచిన 158 పరుగుల లక్ష్యాన్ని కంగారూలు 16.2 ఓవర్లలోనే ఛేదించారు. మునుపటి ఫామ్ అందుకున్న ఓపెనర్ డేవిడ్ వార్నర్ విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. వార్నర్ 56 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 89 పరుగులతో అజేయంగా నిలిచాడు. కెప్టెన్ ఆరోన్ ఫించ్ 9 పరుగులకే అవుట్ కాగా, వన్ డౌన్ లో వచ్చిన మిచెల్ మార్ష్ 53 పరుగులు చేశాడు.

ఈ విజయంతో ఆస్ట్రేలియా తన నెట్ రన్ రేట్ ను మరింత మెరుగుపర్చుకోవడమే కాకుండా, సెమీస్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. సూపర్-12 దశలో ఐదు మ్యాచ్ లు ఆడిన ఆసీస్ 4 విజయాలు, ఒక ఓటమితో పాయింట్ల పట్టికలో రెండోస్థానంలో ఉంది. ఆసీస్ సెమీస్ చేరాలంటే... ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా మ్యాచ్ ఫలితం వచ్చేవరకు ఆగాల్సి ఉంటుంది.

ప్రస్తుతం షార్జాలో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా తలపడనున్నాయి. ఇందులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది. సూపర్-12 దశలో 4 మ్యాచ్ లు ఆడి 3 విజయాలతో కొనసాగుతున్న దక్షిణాఫ్రికాకు కూడా సెమీస్ అవకాశాలు ఉన్నాయి. అయితే నేటి మ్యాచ్ లో ఇంగ్లండ్ పై భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా ఓటమిపాలైనా, సాధారణ విజయం సాధించినా... మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా ఆస్ట్రేలియా సెమీస్ లో అడుగుపెడుతుంది.


More Telugu News