"నేను జయలలిత కూతుర్ని" అంటూ తలైవి సమాధి వద్ద నివాళులు అర్పించిన ప్రేమ అనే మహిళ

  • తెరపైకి వచ్చిన ప్రేమ అనే మహిళ
  • జయలలిత తన కన్నతల్లి అని వెల్లడి
  • జయలలిత తనను బేబీ అని పిలిచేదని వివరణ
  • త్వరలోనే శశికళను కలుస్తానంటున్న ప్రేమ
తాను తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కుమార్తెనంటూ ప్రేమ అనే మహిళ తెరపైకి వచ్చారు. ఇవాళ చెన్నై మెరీనా బీచ్ లోని జయలలిత సమాధి వద్ద ప్రేమ నివాళులు అర్పించారు. తాను జయలలిత కూతుర్ని అనేందుకు అన్ని ఆధారాలు ఉన్నాయని వెల్లడించారు. గతంలో తాను మైసూరులో ఉండేదాన్నని, గత 30 ఏళ్లుగా చెన్నైలోని పల్లవరంలో నివసిస్తున్నానని ప్రేమ తెలిపారు. తాను అందరి ముందుకు రావాలని కోరుకోలేదని, కానీ తన తల్లి జయలలిత జ్ఞాపకాలు తనను నిలవనీయలేదని వివరించారు.

తన మాతృమూర్తి ఆశీస్సుల కోసమే నేడు ఆమె సమాధి వద్దకు వచ్చానని వెల్లడించారు. వాస్తవానికి దీపావళి నాడే ఇక్కడికి వచ్చానని, అయితే సందర్శకుల సమయం ముగిసిందని పోలీసులు అనుమతించలేదని, అందుకే ఆ తర్వాతి రోజు వచ్చానని ప్రేమ వివరించారు. తనను పెంచిన తల్లిదండ్రులు చనిపోయారని, జయలలిత తనను బేబీ అని ముద్దుగా పిలిచేవారని తెలిపారు.

లక్షలాది మంది అమ్మ, అమ్మ అంటూ జయలలిత కోసం పరితపిస్తూనే ఉన్నారని, కానీ తాను కన్నతల్లి కోసం అమ్మా అంటూ వచ్చానని వివరించారు. కానీ ఇప్పుడు తన అమ్మ లేదని, కేవలం చిన్నమ్మ శశికళ ఉన్నారని ప్రేమ పేర్కొన్నారు. చిన్నమ్మ శశికళను కలిసి మాట్లాడతానని ప్రేమ తెలిపారు. కాగా, ప్రేమకు శశికళ అపాయింట్ మెంట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలోనే ప్రేమ... శశికళను కలవనున్నారు. తనకు రాజకీయాల గురించి ఏమాత్రం తెలియదని ప్రేమ వెల్లడించారు.

గతంలో అమ్మ జయలలిత అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు వెనుక గేటు నుంచి వచ్చి ఆమెను పరామర్శించి వెళ్లిపోయానని చెప్పారు. జయలలిత మిమ్మల్ని రమ్మంటోందంటూ ఆమె అనుచరుడు ముత్తుస్వామి తనను పిలిచాడని, తాను అమ్మవద్దకు వెళితే ఆమె ఎంతో ప్రేమగా తనను ముద్దాడిందని తెలిపారు. అంతేకాదు, పొయెస్ గార్డెన్ నివాసంలోనూ తాను ఓసారి జయలలితను కలిశానని పేర్కొన్నారు.

కాగా, తాను జయలలిత కుమార్తెనంటూ అమృత అనే బెంగళూరు మహిళ 2017లోనే తెరపైకి రావడం తెలిసిందే. మీడియా కూడా అమృతపై ప్రధానంగా దృష్టి సారించడంతో అప్పట్లో అదో పెద్ద చర్చనీయాంశం అయింది.


More Telugu News