ఫైనల్ లో పాక్ తో భారత్ ఆడే అవకాశం.. షోయబ్ అక్తర్

  • అదృష్టం కొద్దీ భారత్ సెమీస్ చేరితే అదే జరుగుతుందని కామెంట్
  • న్యూజిలాండ్ పై ఆఫ్ఘన్ గెలిస్తే అనుమానాలొస్తాయని వ్యాఖ్య
  • వాటిని ఆపడం ఎవరి వల్లా కాదని వ్యాఖ్య
టీమిండియా సెమీస్ చేరాలంటే.. న్యూజిలాండ్ పై ఆఫ్ఘనిస్థాన్ గెలిచి తీరాల్సిందే. ఇప్పుడు టీమిండియా ఆటగాళ్లు, అభిమానులు అదే ఆశతో ఉన్నారు. ఆఫ్ఘన్ ఓడిపోతే మనం ఇంటి బాట పట్టాల్సిందే. ఇదే విషయంపై పాకిస్థాన్ స్పీడ్ స్టర్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన యూట్యూబ్ లో మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్లు చేశాడు.

తనకు ఎలాంటి వివాదాల్లోనూ చిక్కుకోవాలని లేదని, కానీ, ముందే ఒక విషయాన్ని చెప్పదలచుకున్నానని చెప్పుకొచ్చాడు. ‘‘ఒకవేళ న్యూజిలాండ్ పై ఆఫ్ఘనిస్థాన్ గెలిస్తే ఎన్నెన్నో సందేహాలు వ్యక్తమవుతాయి. సోషల్ మీడియాలో మరో ట్రెండింగ్ న్యూస్ ప్రచారం జరిగే అవకాశం ఉంది. న్యూజిలాండ్ లో ఉండే పాకిస్థానీలకు సెంటిమెంట్లు ఎక్కువ. ఆఫ్ఘన్ కన్నా న్యూజిలాండ్ జట్టు బలమైనది. అలాంటప్పుడు ఆఫ్ఘన్ పై న్యూజిలాండ్ ఓడితే సోషల్ మీడియాలో వచ్చే నెగెటివ్ పోస్టులను ఆపడం మాత్రం ఎవరి వల్లా కాదు’’ అంటూ వ్యాఖ్యానించాడు.

కోహ్లీ సేన వరుసగా రెండు మ్యాచ్ లు గెలవడంతో టోర్నీ ఆసక్తికరంగా మారిందన్నాడు. అదృష్టం కొద్దీ టీమిండియా సెమీస్ చేరితే.. ఫైనల్ లో పాకిస్థాన్ తో తలపడే అవకాశం ఉందని చెప్పాడు. వాస్తవానికి ఆఫ్ఘనిస్థాన్ ను భారత్ 66 పరుగులతో చిత్తు చేయడంపై పాకిస్థాన్ అభిమానులు.. మ్యాచ్ ను ఫిక్స్ చేశారంటూ సోషల్ మీడియాలో రెచ్చిపోయి కామెంట్లు చేశారు. దుష్ప్రచారాలకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలోనే అక్తర్ ఈ కామెంట్లు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.


More Telugu News