విమాన ప్రమాదంలో బ్రెజిల్ పాప్ క్వీన్ దుర్మరణం

  • బ్రెజిల్ లో విమాన ప్రమాదం
  • ఐదుగురి మృతి
  • టీనేజిలోనే పాప్ గాయనిగా ఎదిగిన మెండోంకా
  • 2019లో ప్రతిష్ఠాత్మక గ్రామీ అవార్డు కైవసం
బ్రెజిల్ పాప్ క్వీన్ గా పేరుగాంచిన మరీలియా మెండోంకా విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. లాటిన్ గ్రామీ అవార్డు కూడా అందుకున్న మెండోంకో బ్రెజిల్ యువతకు ఆరాధ్య గాయని. 26 ఏళ్ల మెండోంకా తన అంకుల్, ఆల్బమ్ నిర్మాతతో కలిసి ప్రయాణిస్తుండగా, మినాస్ గెరాయిస్ రాష్ట్రంలో విమానం కూలిపోయింది. ఓ కచేరీలో పాల్గొనేందుకు ఆమె వెళుతున్నారు ఈ ప్రమాదంలో వీరు ముగ్గురితో పాటు ఇద్దరు విమాన సిబ్బంది కూడా మరణించారు.

మెండోంకా పాటల్లో ప్రధానంగా ప్రేమలో విఫలమైన మహిళలు, జీవితంలో దెబ్బతిన్న మహిళల గురించే ఎక్కువగా ఉండేవి. టీనేజిలోనే గాయనిగా గుర్తింపు తెచ్చుకున్న మరీలియా మెండోంకా 2016 నాటికి బ్రెజిల్ లో అగ్రశ్రేణి పాప్ స్టార్ గా ఎదిగారు. 2019లో ప్రతిష్ఠాత్మక గ్రామీ అవార్డు (లాటిన్ గాయని కేటగిరీ) కూడా అందుకున్నారు. మెండోంకాకు రెండేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు.

విమాన ప్రమాదం గురించి తెలియగానే, మెండోంకా సిబ్బంది ఆమె బతికే ఉన్నారని చెప్పారు. అయితే, ఓ జలపాతం వద్ద విమానం కూలిపోయిన దృశ్యాలు టీవీలో కనిపించిన తర్వాత ఆమె మరణాన్ని ధ్రువీకరించారు.

మెండోంకా మృతితో వరల్డ్ సాకర్ స్టార్, బ్రెజిల్ టాప్ ఫార్వర్డ్ నేమార్ జూనియర్ తీవ్ర విషాదానికి లోనయ్యాడు. ఈ ఘటన నిజమని నమ్మేందుకు నా మనసు అంగీకరించడంలేదు అంటూ ఆక్రోశించాడు. మరో పాప్ స్టార్ అనిట్టా స్పందిస్తూ, నమ్మలేకపోతున్నాను... ఆమె బతికుంటుందేమోనన్న ఆశ నాలో ఇంకా ఉంది అంటూ పేర్కొన్నారు.


More Telugu News