మూటాముల్లె సర్దుకుని ఇంటికొచ్చేయడమే.. విలేకరి అడిగిన ప్రశ్నకు జడేజా కామెంట్స్.. ఇదిగో వీడియో

  • స్కాట్లాండ్ తో మ్యాచ్ అనంతరం మీడియా సమావేశం
  • న్యూజిలాండ్ పై ఆఫ్ఘన్ ఓడితే పరిస్థితేంటన్న జర్నలిస్ట్
  • సూటిగా సరదా సమాధానం ఇచ్చిన జడేజా
  • జడేజా సమాధానంపై నెటిజన్ల భిన్నాభిప్రాయాలు
  • సరదాగా తీసుకున్న కొందరు.. సీరియస్ అవుతున్న ఇంకొందరు
  • మొదటి రెండు మ్యాచ్ లు బాగా ఆడితే ఈ పరిస్థితి వచ్చేది కాదని కామెంట్లు
టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా సెమీఫైనల్ కు వెళ్లాలంటే ఇప్పుడున్న ఏకైక మార్గం ‘అదృష్టం’. అవును మరి, పాకిస్థాన్, న్యూజిలాండ్ ల చేతిలో పరాభవం తర్వాత నెట్ రన్ రేట్ మెరుగుపరచుకోవడం, అదృష్టం మీదే టీమిండియా తర్వాతి స్టేజ్ కు వెళ్లే అవకాశాలుండేది. అయితే, ప్రస్తుతం నెట్ రన్ రేట్ ను భారత్ బాగా మెరుగుపరచుకుంది. నిన్న పసికూన స్కాట్లాండ్ ను భారత్ ఎంతలా చెడుగుడు ఆడేసుకుందో తెలిసిందే. గ్రూప్ 2లో మిగతా జట్లన్నింటికన్నా రన్ రేట్ విషయంలో మెరుగ్గా ఉంది.

ఆ విషయాన్ని అలాఉంచితే.. మరిప్పుడు టీమిండియా సెమీస్ కు వెళ్లాలంటే రేపు ఆఫ్ఘనిస్థాన్ తో జరిగే మ్యాచ్ లో న్యూజిలాండ్ ఓడిపోవాల్సి ఉంటుంది. అలాగైతేనే మనకు చాన్స్ ఉంటుంది. స్కాట్లాండ్ తో మ్యాచ్ అనంతరం ఓ విలేకరి ఇదే ప్రశ్నను జడేజాకు సంధించాడు. న్యూజిలాండ్ పై ఆఫ్ఘన్ గెలిస్తే ఓకే గానీ.. గెలవకపోతే పరిస్థితేంటని అడిగాడు. దానికి జడేజా కూడా అంతే కుండబద్దలుకొట్టినట్టు జవాబిచ్చాడు. ‘‘న్యూజిలాండ్ గెలిస్తే మనం మూటా ముల్లె సర్దుకుని తిరుగు విమానం ఎక్కి ఇండియాకు వచ్చేయాల్సిందే. ఇంకేముంటుంది!’’ అంటూ సరదా కామెంట్స్ చేశాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది.

జడేజా వ్యాఖ్యలపై నెటిజన్లు మిశ్రమంగా స్పందించారు. కొందరు సరదాగా తీసుకుంటే.. మరికొందరు మాత్రం సీరియస్ గానే తీసుకున్నారు. మొదటి రెండు మ్యాచ్ లు గెలిచి ఉంటే ఇంతటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా? అంటూ చురకలు అంటించారు. న్యూజిలాండ్ గెలిస్తే ఇక నమీబియాతో ఇండియా మ్యాచ్ ఆడదన్న మాట అంటూ కామెంట్లు పెడుతున్నారు. జడేజా ఎప్పుడూ అబద్ధం చెప్పడంటూ సెటైర్లు పేలుస్తున్నారు.


More Telugu News