విశాఖలో విద్యుత్ లైన్‌మేన్ దారుణ హత్య.. మంత్రి బొత్స మేనల్లుడిని అరెస్ట్ చేయాలని బాధితుల డిమాండ్

  • మూడు రోజుల క్రితం హత్యకు గురైన బంగార్రాజు
  • బొత్స మేనల్లుడు లక్ష్మణరావు గెస్ట్‌హౌస్ పక్కన విగతజీవిగా కనిపించిన లైన్‌మేన్
  • లక్ష్మణరావును అరెస్ట్ చేసే వరకు పోస్టుమార్టం వద్దంటూ ఆందోళన
విశాఖపట్టణంలోని నమ్మివానిపేటకు చెందిన విద్యుత్ లైన్‌మేన్ ఎం.బంగార్రాజు దారుణహత్య వెనక మంత్రి బొత్స సత్యనారాయణ బంధువు హస్తం ఉన్నట్టు బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. బంగార్రాజు మూడు రోజుల క్రితం ఏనుగులపాలెంలోని బొత్స మేనల్లుడు కోరాడ లక్ష్మణరావు గెస్ట్‌హౌస్ పక్కన హత్యకు గురై కనిపించాడు. గోవిందు అనే మరో వ్యక్తితో కలిసి లక్ష్మణరావు తన భర్తను హత్య చేసినట్టు బంగార్రాజు భార్య నందిని ఆరోపించారు.

విద్యుత్ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి వారిద్దరూ కలిసి కోటి రూపాయలకు పైగా వసూలు చేశారని, అయితే, ఉద్యోగాలు ఇప్పించలేకపోవడంతో డబ్బులు తిరిగి ఇచ్చేస్తామని తన భర్తను అతిథి గృహానికి పిలిపించి హత్య చేశారని ఆరోపిస్తూ రోదించింది. ఈ కేసులో లక్ష్మణరావు హస్తం ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ పోలీసులు కేసు పెట్టకుండా తాత్సారం చేస్తున్నారని, విషయం సీఎం జగన్ దృష్టికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. 

మరోవైపు, లక్ష్మణరావుపై కేసు నమోదు చేసే వరకు పోస్టుమార్టం చేయొద్దంటూ బంగార్రాజు బంధువులు అడ్డుకుని ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల తీరుకు నిరసనగా నిన్న కేజీహెచ్ నుంచి కలెక్టరేట్ వరకు యాదవ సంఘాలు రాస్తారోకో చేసి బైఠాయించాయి. అనంతరం కలెక్టర్‌ మల్లికార్జునకు వినతిపత్రం అందించారు.


More Telugu News