టీ20 వరల్డ్ కప్: స్కాట్లాండ్ తో పోరు... టాస్ టీమిండియాదే!

  • దుబాయ్ లో మ్యాచ్
  • గ్రూప్-2లో మరో పోరు
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
  • మరో మ్యాచ్ లో నమీబియాపై కివీస్ విజయం
టీ20 వరల్డ్ కప్ లో సెమీస్ ఆశలు మిణుకుమిణుకుమంటున్న స్థితిలో టీమిండియా నేడు స్కాట్లాండ్ తో మ్యాచ్ కు సిద్ధమైంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ రవిచంద్రన్ అశ్విన్, వరుణ్ చక్రవర్తి, జడేజాలతో స్పిన్ కాంబినేషన్ ను రంగంలోకి దింపుతోంది. శార్దూల్ ఠాకూర్ ను ఈ మ్యాచ్ కు పక్కనబెట్టారు. పేస్ విభాగంలో బుమ్రా, షమీ ఇద్దరికే చోటు కల్పించారు. మరో పేసర్ గా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య ఉపయోగపడతాడు.

ఇక, పసికూన స్కాట్లాండ్ పై ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. భారత్ పై విజయమే లక్ష్యంగా బరిలో దిగుతామని స్కాట్లాండ్ కెప్టెన్ కైల్ కోయెట్జర్ చెప్పినా, కసితో రగిలిపోతున్న కోహ్లీ సేనను నిలువరించడం ఆ జట్టుకు శక్తికి మించిన పనే!

నమీబియాపై కివీస్ విజయం... టీమిండియా అభిమానులకు నిరాశ


సూపర్-12 దశ గ్రూప్-2లో భాగంగా షార్జాలో నేడు న్యూజిలాండ్, నమీబియా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ పోరులో న్యూజిలాండ్ 52 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 163 పరుగులు చేయగా, లక్ష్యఛేదనలో నమీబియా 20 ఓవర్లలో 7 వికెట్లకు 111 పరుగులు చేసింది.

ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ ఓడితే బాగుండు... టీమిండియా సెమీస్ బెర్తుకు ఓ అడ్డంకి తొలగిపోతుందని భావించిన భారత అభిమానులు తాజా ఫలితంతో నిరాశకు గురయ్యారు. నమీబియాతో పోరులో న్యూజిలాండ్ గెలవడమే కాదు, నెట్ రన్ రేట్ ను కూడా భారీగా మెరుగుపర్చుకుంది.


More Telugu News