డైరెక్టర్ కట్ చెప్పినా ఏడుపాగేది కాదు.. ‘జై భీమ్’ ఫేమ్ ‘సినతల్లి’ లిజోమోల్ జోస్ భావోద్వేగం!

  • గ్లిజరిన్ లేకుండానే కన్నీళ్లు వచ్చేవన్న లిజో
  • మిగతా పాత్రలు ఒకెత్తు.. సినతల్లి పాత్ర ఒకెత్తన్న నటి
  • సినిమా ఎంతో ప్రభావం చూపించిందని కామెంట్
జై భీమ్.. అమెజాన్ ప్రైమ్ లో సక్సెస్ ఫుల్ గా ఆ సినిమా రన్ అవుతోంది. తన భర్త జాడను కనిపెట్టేందుకు, అతడి మరణానికి కారణమైన వారికి శిక్ష పడేందుకు ఓ గర్భిణీ చేసిన పోరాటమే సినిమా కథాంశం. న్యాయవాది చంద్రు పాత్రలో సూర్య సూపర్ రోల్ పోషించాడు. ‘సినతల్లి’ పాత్రలో మలయాళీ నటి లిజోమోల్ జోస్ లీనమైపోయింది. నటించింది అనేకన్నా జీవించింది అంటే బాగుంటుందేమో.

దానికి కారణం లేకపోలేదు. ఆ సినిమా షూటింగ్ లో ఉన్నంత సేపూ ఆమెకు గ్లిజరిన్ లేకుండానే ఏడుపొచ్చేసేదట. ఆ సినిమా నుంచి ఇంకా బయటపడలేకపోతున్నానని ఆమె భావోద్వేగ భరితంగా చెప్పింది. ఆ సినిమా తనపై ఎంతో ప్రభావాన్ని చూపించిందని పేర్కొంది. ఇప్పటిదాకా తాను చేసిన పాత్రలన్నీ ఒకెత్తు.. ‘సినతల్లి’ పాత్ర ఒకెత్తు అని తెలిపింది.


సినతల్లి భర్త రాజన్న మరణానికి సంబంధించిన సీన్లు, పోలీసులు చిత్రహింసలు పెట్టే సీన్లలో అస్సలు గ్లిజరిన్ వాడలేదని చెప్పింది. సీన్లలో నటిస్తున్నప్పుడు కళ్ల నుంచి నీళ్లు కారేవని తెలిపింది. డైరెక్టర్ కట్ చెప్పినా కన్నీళ్లు ఆగేవి కాదని పేర్కొంది. ఇవీ ఆమె గురించిన కొన్ని విశేషాలు..

  • లిజో సొంత రాష్ట్రం కేరళ. ఆమె తల్లిదండ్రులది ఉన్నత మధ్య తరగతి కుటుంబం.
  • అమెరికన్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో డిగ్రీ చేసింది. తర్వాత  కొన్నాళ్ల పాటు ఓ చానెల్ లో పనిచేసింది. పాండిచ్చేరి యూనివర్సిటీలో ఇన్ఫర్మేషన్ అండ్ లైబ్రరీ సైన్స్ లో మాస్టర్స్ చదివింది.  
  • ఫహాద్ ఫాజిల్ నటించిన ‘మహాశింబే ప్రతీకారం’ చిత్రంతో ఆమె సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది. తన స్నేహితురాలి వాట్సాప్ గ్రూప్ లో వచ్చిన సినిమా ఆడిషన్స్ ప్రకటనతో.. ఆమె ఫొటోలు పంపింది.
  • 2016లో వచ్చిన మలయాళ చిత్రం ‘రిత్విక్ రోషన్’తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘హనీ బీ2.5’తో మరింత ఎదిగింది.
  • ఇటీవల విడుదలైన తమిళ చిత్రం ‘శివప్పు మంజల్ పచ్చాయ్ (తెలుగులో ఒరేయ్ బామ్మర్ది) సినిమాలో సిద్ధార్థ్ కు జోడీగా నటించింది. మంచి మార్కులను కొట్టేసింది.
  • ఆ సినిమాలో ఆమె నటనను చూసి ‘జై భీమ్’లో జ్ఞానవేల్ అవకాశం ఇచ్చారు. ఈ సినిమా కోసం లిజో తనను తాను మార్చుకుని డీ గ్లామరస్ రోల్ లో నటించింది.


More Telugu News